ఇంగ్లిష్‌పై పట్టులేక చేజారిన ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌పై పట్టులేక చేజారిన ఉద్యోగం

Aug 30 2025 8:00 AM | Updated on Aug 30 2025 8:00 AM

ఇంగ్లిష్‌పై పట్టులేక చేజారిన ఉద్యోగం

ఇంగ్లిష్‌పై పట్టులేక చేజారిన ఉద్యోగం

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ(ప్రావీణ్యం) పరీక్ష పాస్‌ కాని కారణంగా ఓ అభ్యర్థి పీజీటీ పోస్టు కోల్పోయాడు. డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రెండో రోజు శుక్రవారం కూడా ప్రశాంతంగా సాగింది. గురువారం హాజరుకాని అభ్యర్థులకూ అవకాశం కల్పించడంతో రెండు రోజులకు కలిపి మొత్తం 757 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు అందాయి. వీరిలో వివిధ కారణాలతో 9 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పెండింగ్‌ పెట్టారు. కొన్ని సర్టిఫికెట్లు లేని కారణంగా హాజరైన వారిలో ముగ్గురివి పెండింగ్‌ పడగా, ఒక అభ్యర్థి ఫోన్‌ పని చేయలేదు. మరొక అభ్యర్థి బెంగళూరులో స్థిరపడ్డానని, తనకు ఇష్టం లేదని స్పష్టత ఇచ్చాడు. కేజీబీవీలో సీఆర్టీగా పని చేస్తూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా ఎంపికై న అభ్యర్థినిపై ఫిర్యాదు రావడంతో పెండింగ్‌ పెట్టారు. ఆమె సర్వీస్‌లో ఉంటూ జీతం తీసుకుంటూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈమె తొలిరోజు హాజరైనా ఫిర్యాదు కారణంగా సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోకుండానే వెనుదిరిగింది. ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ పరీక్ష పాస్‌ కాని కారణంగా మరో అభ్యర్థిని రిజెక్ట్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ టీచరు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. అయితే, ప్రిన్సిపాల్‌గా పని చేసిన అనుభవం లేకపోవడంతో ఆయన ఈ పోస్టుకు అనర్హుడయ్యాడు. మొత్తం మీద జిల్లాలో 807 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. రెండు రోజుల్లో 757 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు అందాయి. ఇంకా 50 పోస్టులపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం అందాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా పరిశీలకులు సుబ్బారావు, డీఈఓ ప్రసాద్‌బాబు ప్రక్రియను పర్యవేక్షించారు. పారదర్శకంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని వారు స్పష్టం చేశారు.

మంచి ర్యాంకు సాధించినా

పీజీటీ పోస్టు కోల్పోయిన అభ్యర్థి

రెండోరోజూ ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన

వివిధ కారణాలతో 9 మంది పెండింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement