
యూరియా బస్తాలు
ఆర్‌ఎస్‌కేలకు 165 మెట్రిక్ టన్నుల యూరియా తరలింపు
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు బఫర్‌స్టాక్‌ను వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు బయటకు తీశారు. రైతులు కష్టాలు పడుతున్నా గోదాముల్లో నిల్వ చేసిన యూరియాను బయటకు తీయడం లేదని ‘బఫర్ స్టాక్... బయటకు తీస్తే ఒట్టు’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. యూరియా కొరత, బఫర్‌స్టాక్, రైతుల కష్టాలపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయినట్లు తెలిసింది. ఎక్కడా సమస్య ఉత్పన్నం కాకుండా సమన్వయం చేసుకోవాలని వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఈ క్రమంలో రైతుల నుంచి డిమాండ్, వరి, మొక్కజొన్న విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు శుక్రవారం బఫర్‌స్టాక్ నుంచి యూరియా సరఫరా చేశారు. 13 ఆర్‌ఎస్‌కేలకు 165 మెట్రిక్ టన్నులు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఒక్కో ఆర్‌ఎస్‌కేకు ఒక లారీ యూరియా అందుబాటులో ఉంచామన్నారు. ఇది కాకుండా ఇప్పటికే ఆర్‌ఎస్‌కేల్లో 150 మెట్రిక్ టన్నుల వరకు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. శనివారం రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్) నుంచి 250 మెట్రిక్ టన్నుల మేర యూరియా సరఫరా కానుందన్నారు. ఇందులో 70 శాతం మార్క్‌ఫెడ్, మిగతా 30 శాతం ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు సరఫరా చేస్తామన్నారు.