వణికిస్తున్న జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న జ్వరాలు

Aug 30 2025 8:00 AM | Updated on Aug 30 2025 8:00 AM

వణికిస్తున్న జ్వరాలు

వణికిస్తున్న జ్వరాలు

రాయదుర్గం/గుంతకల్లు రూరల్‌: వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభించాయి. జ్వరం బారిన పడిన ప్రజలు మంచం దిగలేకపోతున్నారు. పిల్లల్లో వైరల్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వైరల్‌తో పాటు కాలానుగుణంగా వచ్చే మలేరియా, డెంగీ కేసులు గుబులు రేపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,153 మందికి రక్త పూతలు సేకరించగా ఇందులో 37 డెంగీ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 3,10,244 మందికి రక్త నమూనాలు సేకరించగా 4 మలేరియా కేసులు నమోదైనట్లు సమాచారం. జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో డెంగీ కేసులు అక్కడక్కడ నమోదయ్యాయి.

పెరుగుతున్న ఓపీ

రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా 800 నుంచి 900 వరకూ ఓపీ నమోదవుతోంది. ఇందులో 200 మందికి పైగా జ్వర పీడితులే ఉంటున్నారు. పేరుకు వంద పడకల ఆస్పత్రైనా, 50 పడకలే ఉన్నాయి. ఆస్పత్రి నిర్మాణం అర్ధాంతరంగా ఆగడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉంటున్నారు. సరిపడ వైద్యులు, సిబ్బంది లేక నాణ్యమైన వైద్య సేవలు అందక రోగులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. దోమ పుట్టకుండా– కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, పాలకులు చేతులెత్తేయడంతో దోమకాటుకు గురై పల్లెలు, పట్టణాల్లో ప్రజలు మంచాన పడుతున్నారు.

ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీ

జ్వరం అంటూ డాక్టర్‌ వద్దకెళితే చాలు రోగి చేతిని కూడా ముట్టకుండానే రక్త పరీక్షలకు రెఫర్‌ చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. డాక్టర్లకు కమీషన్లు ఎర వేస్తూ ఇష్టానుసారంగా రోగులను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డెంగీ రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేయాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స అందజేస్తున్నారు. పరిస్థితి విషమించినప్పుడు ప్రభుత్వాస్పత్రులకు రెఫర్‌ చేస్తుండడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.

నెల రోజులుగా అదుపులోకి రాని పరిస్థితి

గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో నెల రోజులుగా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. గ్రామానికి చెందిన షేక్‌ బీబీ నెల రోజుల క్రితం డెంగీ బారిన పడి మృతిచెందింది. అప్పటి నుంచి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 1,100 కుటుంబాలు, 4,500 పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరి కంటే ఎక్కువ మంది జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా.. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో దిక్కుతోచని గ్రామస్తులు పట్టణ ప్రాంతాల్లో వైద్యుల వద్దకు వెళ్లలేక అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా విష జ్వరాల విజృంభణ

ప్రతి ఇంటా మంచాన పడుతున్న ఒకరిద్దరు

ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీ, ఐపీ కేసులు

కలవరపెడుతున్న డెంగీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement