గుంతకల్లు: మున్సిపల్ అధికారుల తీరుపై గుంతకల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ భవాని కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల విషయంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కౌన్సిల్ హాల్లో చైర్‌పర్సన్ భవాని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశం ప్రారంభం కాగానే తొలుత అజెండాలోని పలు అంశాలపై చర్చ సాగింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ లింగన్న మాట్లాడుతూ.. తమ వార్డు పరిధిలో రూ. లక్షల వ్యయంతో కూడిన పనులకు సంబంధించిన అంశాలు అజెండాలో కనిపిస్తున్నాయని, అయితే క్షేత్ర స్థాయిలో ఆ పనులు ఎక్కడేగాని కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావడం.. ఇచ్చిన స్నాక్స్ తిని, టీ తాగి అజెండాను ఆమోదించి వెళ్లిపోవడం తప్ప కౌన్సిలర్లు ఎందుకు పనికిరాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి సంబంధించి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌లో రూ.50 లక్షలు విలువ చేసే మోటార్లు అపహరణకు గురైతే రూ.50 వేల విలువ యంత్రాలను అపహరించినట్లుగా కేసు నమోదు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్న చోరీ సూత్రధారులు ఎవరైంది కనిపెట్టలేకపోయారని మండిపడ్డారు. వైకల్యం కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా.. పింఛన్లు తొలగించడం అన్యాయమని కౌన్సిలర్లు జేసీబీ చాంద్‌బాషా, కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌన్సిలర్లు పవన్‌గౌడ్, కందూరి కృపాకర్ మాట్లాడుతూ.. తమ వార్డులో అభివృద్ది పనులకు టెండర్లు పిలిచినా పనులు మాత్రం చేపట్టలేదన్నారు. చిన్నపాటి మరమ్మతు పనులు కూడా చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ పనులకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ మెహరున్నీషా బేగం మాట్లాడుతూ.. సత్యనారయణపేటలోని హిందూ శ్మశాన వాటికలో మౌలిక వసుతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్, ఏసీ లక్ష్మీదేవి, ఎంఈ ఇంతియాజ్ అలి, డీఈలు షబానా, సుమ, ప్రకాష్‌నాయుడు, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్, టీపీ సూపర్‌వైజర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
పట్టణ సమస్యలు పట్టించుకోని అధికారుల తీరుపై అసంతృప్తి
అజెండాలకే పరిమితమవుతున్నారని ఆగ్రహం