
తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
అనంతపురం అర్బన్: తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని కలెక్టర్ వినోద్‌కుమార్ కొనియాడారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగుభాషా దినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. గిడుగు రామమూర్తి చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి, మాట్లాడారు. వ్యవహారిక భాషోద్యమానికి మూలపరుషుడు గిడుగు రామమూర్తి అని, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న వీలును తెలియజెప్పిన మహనీయుడని కీర్తించారు. కొద్దిమందికే పరిమితమైన చదువు రామమూర్తి కారణంగా వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, డీఎస్‌పీ శ్రీనివాసరావు, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్ధయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.