
కొండలపై రేసింగ్
పుట్లూరు/శింగనమల: వ్యవసాయం మినహా ఏమీ ఎరుగని గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌ల మోత మోగింది. పుట్లూరు మండలం మడుగుపల్లి, ఎల్లుట్ల సమీపంలోని కొండలపై గాలిమరల వద్ద కారు, బైక్ రేసింగ్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఓ స్పోర్ట్స్ బైక్ రైడర్ నియంత్రణ కోల్పోయి ఎల్లుట్ల నుంచి నార్పలకు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు బాలాజీని ఢీకొన్నాడు. ఘటనలో బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. కాగా, బెంగళూరుకు చెందిన మోటార్ స్పోర్ట్స్ నిర్వాహకులు శింగనమల, బుక్కరాయసముద్రం, పుట్లూరు ప్రాంతాల్లోని గాలిమరల రహదారులను రేసింగ్ కోసం శుక్రవారం పరిశీలించారు. దాదాపు 32 స్పోర్ట్స్ బైక్‌లు, 16 కారులతో టెస్ట్ రేసింగ్ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.