
గుంతకల్లు టౌన్: సొంత పనులు కూడా చేసుకోలేని అసహాయుల పింఛన్లను రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రీ వెరిఫికేషన్ పేరిట అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దివ్యాంగులతో కలసి శుక్రవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపడం తగదని, తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించకపోతే మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు పాల్గొన్నారు.