
అక్రమాల షాక్
అనంతపురం నగరంలోని రెండో రోడ్డు సమీపంలో ఉన్న ఈ భవనానికి ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండానే ఐదు నెలల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ఏడు విద్యుత్ సర్వీసులతో పాటు లిఫ్ట్‌కు అవసరమైన 3 ఫేజ్ కనెక్షనూ మంజూరు చేశారు. కనెక్షన్ ఇచ్చే ముందు ఆ భవనానికి ఎన్ని కిలో వాట్ల విద్యుత్ అవసరమవుతుందో గుర్తించి, ఆ మేరకు ఎస్టిమేషన్ రూపొందించి అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఎస్టిమేషన్ లేకుండానే కనెక్షన్లు మంజూరు చేయడంతో సంస్థకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లింది.
అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఈ భవనానికి విద్యుత్ శాఖ అధికారులు
ఎలాంటి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకుండానే 7 విద్యుత్ సర్వీసులను మంజూరు చేశారు. 11 కేవీ విద్యుత్ లైన్ లేకపోయినా భవన యజమానితో లబ్ధి పొంది విద్యుత్ సంస్థ ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎస్టిమేషన్ వేసి ఉంటే సంస్థకు రూ.4 లక్షలకుపైగా ఆదాయం సమకూరేది.
...ఈ రెండూ కేవలం ఉదాహరణ మాత్రమే. ఉన్నతాధికారుల అండతోనే కొందరు అక్రమార్జనకు తెరలేపడంతో సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతపురం టౌన్: విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి విద్యుత్ అక్రమ కనెక్షన్లు జారీ చేస్తూ కలెక్షన్ కింగ్‌లుగా మారారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ సొంత ఖజానాలను నింపుకోవడంతో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
సంస్థపై అదనపు భారం
విద్యుత్ అక్రమ కనెక్షన్ల ఫలితంగా అనంతపురంలోని చాలా ప్రాంతాల్లో లో ఓల్టేజీ పెరిగి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సంస్థ ఏటా రూ.కోట్ల ఖర్చుతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. భారీ భవంతులకు ముందుగానే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సర్వీసులను మంజూరు చేస్తే లో ఓల్టేజీ సమస్యకు ముందుగానే చెక్ పెట్టవచ్చు. అయితే విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతో లో ఓల్టేజీ సమస్యకు కారణమవుతున్నట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలో రూ.15 కోట్లకు పైగా ఖర్చు చేసి అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సంస్థ అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు.
చర్యలకు వెనుకడుగు
విద్యుత్ అక్రమ కనెక్షన్లపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై పత్రికల్లో కథనాలు వెలువడినా అక్రమార్కులపై చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. విచారణ పేరిట కాలయాపన చేయడం తప్ప సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై తీసుకున్నచర్యలు ఏమీ లేవు. ఇది మరికొందరికి ఊతమిచ్చింది. యూనియన్ల మాటున అక్రమంగా విద్యుత్ సర్వీసులను మంజూరు చేస్తూ సొంత జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. అనంతపురం నగరంలోని డీ5, డీ3 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలోని బళ్లారి రోడ్డు, శ్రీనగర్‌కాలనీ, గుత్తి రోడ్డు, భైరవనగర్ తదితర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెద్ద పెద్ద భవంతులు, మాల్స్ ఏర్పాటు అవుతున్నాయి. వీటికి విద్యుత్ కనెక్షన్లు ఇష్టారాజ్యంగా మంజూరు చేస్తుండడంతో ఆయా ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు నానాటికీ తీవ్ర మవుతున్నాయి. ఇప్పటికై నా విద్యుత్ అక్రమ కనెక్షన్లకు అడ్డు కట్ట వేయకపోతే సంస్థ నష్టాల్లో కూరుకు పోవడం ఖాయమనే వాదనలు సొంత శాఖలోని కొందరు ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
ముడుపులిస్తే ఎస్టిమేషన్ లేకుండానే విద్యుత్ కనెక్షన్లు
విద్యుత్ సంస్థ ఆదాయానికి భారీగా గండి
అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండ

అక్రమాల షాక్