
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి
అనంతపురం: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ , ఎక్స్‌పర్ట్ ప్రమోషన్ కమిటీ) సమావేశం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా అన్ని శాఖల వారు ప్రోత్సహించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులను జారీ చేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైన సందర్భంగా జిల్లా స్కిల్ డెలప్‌మెంట్ అధికారి ప్రతాప్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కర్ష్’లో జిల్లాను అగ్రస్థానంలో నిలపండి
ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం అమలులో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. పథకంపై న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పోర్టల్ ప్రదర్శన నిర్వహించింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో కలెక్టర్‌తో పాటు డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సురేష్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద గుంతకల్లు మండలం గుండాల తండా, వజ్రకరూరు మండలం వెంకటంపల్లి చిన్న తండా, పెద్ద తండా, శింగనమల మండలం నాగులగుడ్డం, నాగుల గుడ్డం తండా గ్రామాలు ఎంపికై నట్లు వివరించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 20 శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేందుకూ సిద్ధంగా ఉండాలన్నారు.