24న టీటీసీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

24న టీటీసీ పరీక్షలు

Aug 20 2025 5:41 AM | Updated on Aug 20 2025 5:41 AM

24న టీటీసీ పరీక్షలు

24న టీటీసీ పరీక్షలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) పరీక్షలు ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ జి. వెంకటేష్‌ తెలిపారు. మూడు విడతలుగా పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 4.30 గంటల వరకు ఉంటాయన్నారు. మొదటి రోడ్డులోని నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని సూచించారు. హాల్‌టికెట్‌తో పాటు పాన్‌/ఓటర్‌ ఐడీ/ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలియజేశారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

జిల్లాకు 1,016

మెట్రిక్‌ టన్నుల ‘కాంప్లెక్స్‌’

అనంతపురం అగ్రికల్చర్‌: ఫ్యాక్ట్‌ కంపెనీకి చెందిన 1,016 మెట్రిక్‌ టన్నుల 20–20–0–13 రకం కాంప్లెక్స్‌ ఎరువులు మంగళవారం జిల్లాకు చేరినట్లు రేక్‌ ఆఫీసర్‌, ఏడీఏ అల్తాఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్‌ రేక్‌పాయింట్‌లో వ్యాగన్ల ద్వారా వచ్చిన కాంప్లెక్స్‌ను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు 826 మెట్రిక్‌ టన్నులు ప్రైవేట్‌ డీలర్లకు సరఫరా చేసి, మిగతా 190 మెట్రిక్‌ టన్నులు కంపెనీ గోదాములో నిల్వ చేయనున్నట్లు తెలిపారు.

ఇంటర్న్‌షిప్‌ క్రెడిట్ల కుదింపు.. లాంగ్వేజ్‌ల పొడిగింపు

నేడు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

అనంతపురం: డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ బుధవారం జారీ కానుంది. సంప్రదాయ డిగ్రీ అడ్మిషన్లలో ప్రభుత్వం మార్పులు చేసింది. కళాశాలలో విద్యార్థి దరఖాస్తు సమర్పించే సమయంలో కచ్చితంగా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ తీసుకోవాలని సూచించింది. ఎలా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మెరిట్‌ ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయిస్తారు. వీటిల్లో గ్రూప్‌–1(12 కులాలు)ఒక శాతం,గ్రూప్‌ 2 (18 కులాలు)కు 6.5 శాతం, గ్రూప్‌ 3 (29 కులాలు)కు 7.5 శాతం విభజించారు. తాజాగా ప్రతిపాదించిన మేజర్‌–కోర్‌ సబ్జెక్టుకు కేవలం 44 క్రెడిట్లు ఇచ్చారు. మేజర్‌ ఆప్షనల్‌కు 16 క్రెడిట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 126 క్రెడిట్లు నిర్దేశించారు. ఇందులో లాంగ్వేజెస్‌ను మూడో సెమిస్టర్‌ వరకు పొడిగించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో మార్కెట్‌ ఓరియెంటెడ్‌ విధానాన్ని అలవర్చే ఇంటర్న్‌షిప్‌ను తగ్గించారు. పేరుకు రెండు మేజర్‌ సబ్జెక్టులు చూపించినప్పటికీ అందులో ఒకటి ఆప్షనల్‌ కావడం, వాటికి కేవలం 16 క్రెడిట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇలా చేయడంతో పీజీ చేసుకునే అవకాశం ఉండదు. ఇక మేజర్‌ కోర్‌ సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్నే ఆప్షనల్‌ మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

‘నక్ష’ను గడుపులోపు పూర్తి చేయాలి

సీడీఎంఓ సంపత్‌కుమార్‌

అనంతపురం కార్పొరేషన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్‌ (నక్ష)’ కార్యక్రమాన్ని 45 రోజుల్లో పూర్తి చేస్తే రూ.50 కోట్లు నగరపాలక సంస్థకు వస్తాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థలో ఉమ్మడి జిల్లాల కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల్లో పన్నులపై సర్వే చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కాలువలకు మరమ్మతు చేయించాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ బాలస్వామి పాల్గొన్నారు.

కుక్కల బెడదకు పరిష్కారం చూపాలి

నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, శునకాల బెడదకు పరిష్కారం చూపాలని మేయర్‌ వసీం డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంపత్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. గతంలో కంపోస్టు యార్డులో కుక్కల బెడదకు స్టెరిలైజేషన్‌ చేశారన్నారు. అనంతరం సంపత్‌కుమార్‌ కంపోస్టు యార్డును పరిశీలించారు. మేయర్‌ వెంట కార్పొరేటర్లు ఇసాక్‌, కమల్‌భూషణ్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు చింతకుంట మధు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement