
అధిష్టానం ముందు అరాచకాల చిట్టా
● టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన 40 మంది అనంత వాసులు
● ప్రజాప్రతినిధి వేధింపులపై
ఆధారాలతో సహా ఫిర్యాదు
అనంతపురం క్రైం: ‘అనంత’లో టీడీపీ పరువు రోడ్డున పడింది. ప్రజా ప్రతినిధి ధనదాహం ఓ వైపు, తమ్ముళ్ల దౌర్జన్యాలు మరో వైపు... నామినేటెడ్ పోస్టుల పేరుతో డబ్బు వసూళ్ల నుంచి మద్యం దుకాణాల్లో మామూళ్లు.. పేదల బియ్యం కోటాలో వాటాలు... విలువైన భూముల్లో కంచె వేసి కబ్జా చేయడం లాంటి అనేక ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ముందు బాధితులు ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...అనంత ప్రజాప్రతినిధి దౌర్జన్యాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు వివరించారు. మంగళవారం సాయంత్రం 40 మంది బాధితులు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జరిగిన అన్యాయాలపై ‘పల్లా’కు విన్నవించుకున్నారు. ప్రధానంగా అనంత నగర శివారులోని 210 సర్వే నంబరులో భూమి కబ్జాతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న అస్రా ఆప్టికల్స్‌కు సంబంధించి మైనార్టీ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆధారాలతో సహా ఆయన ముందుంచారు. స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా నగరంలో పార్టీకి చెందిన వారిని, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి బెదిరించాడని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధితోపాటు సన్నిహితుల వ్యవహార శైలితో నగరంలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. మద్యం దుకాణాల సిండికేట్ విషయం, అక్రమ వసూళ్ల దందాతో పాటు ఇతర వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధి, అతని బంధువులు, కుటుంబ సభ్యులు, అనుంగులు చేసిన అకృత్యాలను ఆధారాలతో అందజేసినట్లు తెలుస్తోంది.
ఆ ఆడియో సంచలనం:
‘అస్రా ఆప్టికల్స్’కు చెందిన మైనార్టీ కుటుంబాన్ని అత్యంత పరుష పదజాలంతో ప్రజా ప్రతినిధి దూషించిన ఆడియోని పల్లాకు వినిపించినట్లు తెలిసింది. ఈ ఆడియో విని షాక్ తిన్న ఆయన దాన్ని అక్కడే డిలీట్ చేయాలని కోరినట్లు సమాచారం. దారుణంగా మాట్లాడి... తమ ఆస్తులపై దాడులు చేసింది కాకుండా తమను ఒకానొక దశలో ఊరు కూడా వదిలిపోవాలని బెదిరించినట్లు వాపోయారు. కాగా బుధవారం నేరుగా పార్టీ అధినేతను బాధితులందరూ కలిసే అవకాశం కల్పిస్తానని చెప్పినా.. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది.
మాజీ ఎమ్మెల్యే సారథ్యమా?
పార్టీ అధిష్టానం పిలుపుతో బాధితులు రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారా.. లేక మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సారథ్యంలో కలుస్తున్నారా... అన్నది తెలియరాలేదు. పార్టీలో చాలా కాలంగా పని చేసిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలతో కలసి చౌదరి పార్టీ అధిష్టానాన్ని కలిసినట్లు తెలిసింది.