అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త.. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త.. వ్యక్తి మృతి

Aug 20 2025 5:41 AM | Updated on Aug 20 2025 5:41 AM

అంబుల

అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త.. వ్యక్తి మృతి

అనంతపురం: అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త ఓ ద్విచక్ర వాహన చోదకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని విద్యుత్‌ నగర్‌ రోడ్డులో ఉన్న పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్మకర్త ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్‌ రేకునార్‌ వేణుగోపాల్‌ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆలయానికి వెళ్లి రాత్రి 8.15 గంటలకు ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లోని కుమార్‌ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే ఓ అంబులెన్స్‌ (ఏపీ39టీఎన్‌0767) డ్రైవర్‌ ఉన్నఫళంగా కుడివైపు డోర్‌ తీయడంతో అప్పటికే అత్యంత సమీపంలోకి చేరుకున్న వేణుగోపాల్‌ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర రక్తస్రావమవుతున్న వేణుగోపాల్‌ను వెంటనే కుమార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి వేణుగోపాల్‌ మృతి చెందాడు. తన భర్త మృతికి అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి భార్య నాగరత్నమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సర్పంచ్‌ మోనాలిసాకు కలెక్టర్‌ అభినందన

అనంతపురం అర్బన్‌/వజ్రకరూరు: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘సర్పంచ్‌ సంవాద్‌’ కార్యక్రమంలో పాల్గొని చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌ అనే థీమ్‌తో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి జాతీస్థాయి పురస్కారానికి ఎంపికై న వజ్రకరూరు పంచాయతీ సర్పంచ్‌ ఎం.మోనాలిసాను కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. సర్పంచ్‌ను అభినందిస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సూర్యకుమారి లేఖ కలెక్టర్‌కు మంగళవారం అందింది. ఈ లేఖను మోనాలిసాకు ఎంపీడీఓ దామోదరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ మోనాలిసా జాతీయస్థాయిలో ప్రశంసనీయమైన విజయాన్ని సాధించి జిల్లా కీర్తిని దేశవ్యాప్తం చేశారని అన్నారు. డైరెక్టర్‌ అభినందిస్తూ తన లేఖలో... నిరంతర మార్గదర్శకత్వం, సమన్వయం ద్వారా జిల్లా యంత్రాంగం గ్రామంలో బాలలకు అనుకూలమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషదాయకమైందని పేర్కొన్నారు. బాలల విద్య, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికులు, బాల యాచక నిర్మూలనకు కృషి చేయడం అభినందనీయమన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఫిట్‌నెస్‌ కోసం యోగా కార్యక్రమాలు ప్రోత్సహించడం, మిషన్‌ వాత్సల్య లక్ష్యాలను చురుకుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

‘డీఎస్సీ’ సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: మెగా డీఎస్సీలో భాగంగా ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాకు ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ఎంఈఓ/హెచ్‌ఎంలు, సాంకేతిక పరిజ్ఞానం కల్గిన ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హతల మార్కులు, లోకల్‌, నాన్‌ లోకల్‌ తదితర సర్టిఫికెట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం విజయవాడలో ఒక రోజు శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబుతో పాటు పలువురు సిబ్బంది మూడు రోజులుగా అక్కడే మకాం వేసి జాబితా ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో తాత్కాలిక ఎంపిక జాబితా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జైళ్ల శాఖ పెట్రోల్‌ బంకుల్లో అక్రమాలు

ధర్మవరంలోని పెట్రోల్‌ బంకులో రూ.20 లక్షల అవినీతి

అడ్డగోలు వ్యవహారంలో నలుగురి చేతివాటం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జైళ్ల శాఖ కడప రేంజ్‌ డీఐజీ పరిధిలోని పెట్రోల్‌ బంకుల్లో అవినీతి తవ్వేకొద్దీ బయట పడుతోంది. పలువురు సిబ్బంది బంకుల్లోని సొమ్ము కాజేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని పెట్రోల్‌ బంకు పరిధిలో అప్పటి డీఐజీ, అనంతపురం డీఎస్‌డీఓ, అక్కడ జైలర్‌గా పనిచేస్తూ బదిలీపై కడప కేంద్ర కారాగారానికి వచ్చిన మరో జైలర్‌, ధర్మవరంలో పనిచేస్తూ ప్రస్తుతం తాడిపత్రికి బదిలీపై వెళ్లిన డిప్యూటీ జైలర్‌ ఈ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. సదరు డిప్యూటీ జైలర్‌ పెట్రోల్‌ బంకు నిర్వహణ ఛార్జ్‌ డీఎస్‌డీఓకు అప్పగించే క్రమంలో ఈ లొసుగులు బయటపడినట్లు తెలిసింది. రూ.20 లక్షల మేర పెట్రోల్‌ బంకు డబ్బులు, రూ.1.50 లక్షలు పీపీసీ (ప్రిజనర్స్‌ పార్టిసిపేషన్‌ క్యాష్‌) తక్కువగా ఉండడంతో డీఎస్‌డీఓ ఛార్జ్‌ తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ప్రస్తుతం వార్డర్‌లే పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నారు. అప్పటి కీలక అధికారి పెద్ద మొత్తంలో డబ్బును తన అవసరాలకు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ అధికారి తీసుకున్న మొత్తం డబ్బు బంధువులు, వార్డర్స్‌ ఫోన్‌పేల రూపంలో చెల్లించినట్లు సమాచారం. డిప్యూటీ జైలర్‌ తాను చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవడం, ఇతర కారణాలతో అప్పట్లో డిపార్ట్‌మెంట్‌ అతన్ని డిస్మిస్‌ చేసింది. ఆ డిప్యూటీ జైలర్‌ వాడుకున్న మొత్తాన్ని ఎవరు కట్టాలో.. దిక్కుతోచక ఒక కమిటీని నియమించి కడప రేంజ్‌ డీఐజీ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లిలోని పెట్రోల్‌ బంక్‌లోనూ రూ. 62 లక్షల మేరకు అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి పాల్పడిన వారిలో ప్రధానంగా కర్నూలు డీఎస్‌డీఓతో పాటు, డిప్యూటీ జైలర్‌, ఓ హెడ్‌ వార్డర్‌ ఉన్నట్లు తెలిసింది. అవినీతికి ఊతమిచ్చిన డీఎస్‌డీఓకు అడిషనల్‌ ఎస్పీ ర్యాంక్‌తో పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్దమైన తరుణంలో అక్రమాలు బయటపడడం గమనార్హం.

అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త.. వ్యక్తి మృతి 1
1/1

అంబులెన్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్త.. వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement