
ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సుకు షోకాజ్ నోటీసు
గుత్తి: వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గుత్తి సీహెచ్‌సీ వైద్యులు ఎ.రమ్యశ్రీ, ఎన్.రమశ్రీతో పాటు స్టాఫ్ నర్సు రామాంజినమ్మకు ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ యల్లప్ప మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం మారెప్ప అనే రోగి జ్వరంతో ఆస్పత్రికి రాగా, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మారెప్ప మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఽఆందోళన చేశారు. ఈ క్రమంలో వైద్యులు, స్టాఫ్‌నర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నారు.
నీట్ పీజీ ఫలితాల్లో సత్తా చాటిన డాక్టర్ వరుణ్
కళ్యాణదుర్గం రూరల్: జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పీజీ–2025 పరీక్షల్లో కళ్యాణదుర్గం పట్టణ ప్రముఖుడు ఏసీ తిప్పేస్వామి మనవడు డాక్టర్ వరుణ్ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 3న నీట్ పీజీ 2025 పరీక్ష ఒకే షిఫ్ట్‌లో జరిగింది. దీని ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. మైసూర్‌లో ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ వరుణ్‌కుమార్... నీట్ పీజీ–2025 పరీక్షల్లో 650/800 మార్కులతో జాతీయ స్థాయిలో 290 ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన డాక్టర్ వరుణ్‌కుమార్‌ను మిత్రులు, బంధువులు అభినందించారు.