
ప్రజలు నన్ను అడ్డుకుంటే ఇళ్లు రాసిస్తా
● తాడిపత్రికి వెళ్లాలంటే వీసా ఏమైనా కావాలా? : మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి
అనంతపురం కార్పొరేషన్: ‘నేను తాడిపత్రికి వెళితే శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాడిపత్రికి వెళ్లాలంటే ఏమైనా వీసా కావాల్నా..? నన్ను నిజంగా అక్కడి ప్రజలు రాకుండా అడ్డుకుంటే నా ఇళ్లు రాసిస్తా’ అని వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఉత్తర్వులున్నా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వన్‌సైడ్ కేసులు ఎక్కడా నమోదు చేయలేదన్నారు.ప్రస్తుతం వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు, అక్రమ కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనలతో పోలీసులు నమోదు చేస్తున్నారన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా తనను తాడిపత్రికి రాకుండా పోలీసులతో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. 700 మంది పోలీసులతో తనను ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం అని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. పోలీసుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే చేసుకుంటే తెలుస్తుందన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఉన్నాడా లేడా అన్న క్లారిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే విచారణ చేయాలన్నారు. అదేవిధంగా 420, గజదొంగ, అక్రమార్కుడైన జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ, సిట్‌తో విచారణ చేయిస్తే తాడిపత్రిని నాశనం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుస్తుందని ఆయన సూచించారు. ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
మారని పోలీసుల తీరు...
సాక్షి టాస్క్‌ఫోర్స్: చట్టానికి లోబడి విధులు నిర్వహించాల్సిన పోలీసులు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సోమవారం హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డగించిన విషయం విదితమే. మంగళవారం మరోమారు పుట్లూరు మండలం సూరేపల్లి వద్ద సీఐ సత్యబాబు సిబ్బందితో కలిసి మాజీ ఎమ్మెల్యేను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం వెళ్లిపోయారు.
తాడిపత్రిలో హైఅలర్ట్
తాడిపత్రిలో హైఅలర్ట్ నెలకొంది. పట్టణంలో మంగళవారం పోలీస్ బలగాలతో ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి కవాతు నిర్వహించారు. ఇరుపార్టీల నాయకుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
రాళ్లు రువ్వేందుకు ప్రయత్నిస్తే కాల్చిపారేస్తాం..
అల్లరి మూకలు రాళ్లు విసిరేందుకు ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి హెచ్చరికలు జారీ చేశారు. కవాతు సందర్భంగా ఏఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని చూస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు హద్దు దాటి ముందుకు వచ్చినా, రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించినా టియర్‌గ్యాస్ ఉపయోగిస్తామన్నారు. లాఠీ చార్జ్ చేసేందుకూ వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.