బదిలీల గోలలో విత్తన పంపిణీ ఆలస్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ముంచుకొస్తున్నా ఇప్పటికీ విత్తన ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా, పంపిణీ చురుగ్గా కొనసాగాల్సివుండగా... ప్రస్తుతానికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో విత్తన పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మండల వ్యవసాయాధికారులు (ఎంఏఓలు), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) విత్తన పంపిణీలో కీలకం. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) అసిస్టెంట్లు భాగస్వాములు కావాలి. అయితే, ఏఓలు, ఏఈఓలు పెద్ద సంఖ్యలో బదిలీలు అవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖలో అన్ని విభాగాల పరిధిలో ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసు పూర్తీ చేసుకున్నవారు ఏకంగా 144 మంది ఉన్నారు. వీరందరికీ తప్పనిసరిగా స్థానచలనం తప్పదు. ఈ క్రమంలో తమనూ బదిలీ చేయాలంటూ మరికొందరు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి.
ఇబ్బందులు తప్పవు..
ఎటూ బదిలీ కాక తప్పదనే ఆలోచనతో చాలా మంది ఏఓలు, ఏఈఓలు విత్తన పంపిణీ పక్రియ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. బదిలీల ప్రక్రియ జూన్ 2న ముగియనుండటంతో అంతవరకు విత్తన పంపిణీ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాతనే విత్తన పంపిణీలో భాగస్వాములు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి, మడకశిర, ధర్మవరం పెనుకొండ, కదిరి ఏడీఏలతో పాటు ‘ఆత్మ’ ఏడీఏ కూడా బదిలీ కానున్నారు. 31 మంది ఏఓలు, 78 మంది ఏఈఓలు, మినిస్టీరియల్ స్టాఫ్ 20 మంది మారిపోనున్నారు. బదిలీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున విత్తన పంపిణీ ఆలస్యం కావడంతో పాటు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, ఏపీఎంఐపీ, మార్కెటింగ్, పట్టు, పశుసంవర్ధక, మత్స్యశాఖలో కూడా బదిలీల కోలాహలం మొదలైంది. సిఫారసు లేఖల కోసం ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది.
వ్యవసాయ శాఖలో
144 మందికి స్థానచలనం
విత్తన పంపిణీపై దృష్టి సారించని వైనం


