ఈ–పాస్ మిషన్ అపహరణ
రాయదుర్గం టౌన్: స్థానిక కోతిగుట్టలోని 17వ నంబర్ స్టోరు డీలర్ రామకృష్ణను బెదిరించి ఆ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ అశోక్ దౌర్జన్యంగా ఈ–పాస్ మిషన్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు తెలిపిన మేరకు... డీలర్ షిప్ దక్కించుకునేందుకు అశోక్ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అధికారులపై ఒత్తిళ్లు తీసుకెళ్లడంతో పలుమార్లు తనిఖీలు చేసి 6ఏ కేసు నమోదు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారణ కావడంతో అధికారులు సైతం అడుగు ముందుకు వేయలేకపోయారు. దీంతో ఈ నెల 3న స్టోర్ వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న సమయంలో అశోక్ అక్కడకు చేరుకుని దౌర్జన్యంగా ఈ–పాస్ మిషన్ ఎత్తుకెళ్లాడు. దీంతో కార్డుదారులకు రేషన్ పంపిణీ నిలిచిపోయింది.స్టోరు పరిధిలో మొత్తం 936 కార్డులు ఉండగా 625 కార్డులకు రేషన్ పంపిణీ జరిగింది. ఇంకా 300లకు పైగా లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. శనివారం నుంచి లబ్దిదారులు స్టోరు వద్ద వచ్చి తిరిగి మిషన్ లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు, తహసీల్దార్, సీఎస్‌డీటీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి పరిష్కారం దక్కలేదు. ఈ–పాస్ యంత్రం అపహరణపై సీఐకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని బాధితుడు వాపోయాడు. ఈ అంశంపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు.
టీడీపీ వార్డు ఇన్‌చార్జ్ నిర్వాకంతో కార్డుదారులకు అందని రేషన్
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు


