పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ
అనంతపురం అర్బన్: జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 445 వినతులు అందాయి. ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్‌శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్, తిప్పేనాయక్ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి సమస్యకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు.
వినతులు కొన్ని...
● పుట్లూరు మండల కేంద్రానికి చెందిన కె.నాగలక్ష్మి నడవలేనిస్థితి. ఆమెను బంధువులు ఆటోలో కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. ఈమెకు వైకల్యం సున్నా శాతం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇవ్వడంతో పింఛన్ రాలేదు. అర్జీ పెట్టుకుంటే 15 రోజుల్లో సర్టిఫికెట్ ఇస్తామన్నారని, రెండేళ్లు గడుస్తున్నా సర్టిఫికెట్ ఇవ్వలేదని నాగలక్ష్మి కలెక్టర్‌కు విన్నవించుకుంది.
● ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూమి పట్టా ఇవ్వాలని రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన టి.నారాయణమ్మ విన్నవించింది. గ్రామ పొలం సర్వే నెంబరు 127లో 1.62 ఎకరాల భూమిని 30 ఏళ్లగా సాగు చేసుకుంటున్నాని చెప్పింది. తాను సాగు చేసుకుంటున్న విషయం వాస్తవమేనంటూ 2016లో అప్పటి తహసీల్దారు నిర్ధారిస్తూ తదుపరి భూ పంపిణీలో ఇస్తామని ఎండార్స్‌మెంట్ ఇచ్చారని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్‌డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో అర్జీ ఇస్తూనే ఉన్నానని, అయితే ఇప్పటి వరకు తనకు పట్టా ఇవ్వలేదని వాపోయింది.
పురుగుల మందు డబ్బాతో..
ఏళ్ల్లుగా తిరుగుతున్నా.. ఇప్పటికైనా నా సమస్య పరిష్కరించండి. లేదంటే ఇక్కడే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన ఎస్.గోపాల్ విషయాన్ని అర్జీలో రాసి కలెక్టర్‌కు ఇచ్చారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బాఽధితుడి వద్దకు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ స్వయంగా వచ్చి అతని అర్జీని పరిశీలించాడు. సర్వే నెంబరు 136/6లో 1.24 ఎకరాలు మిగులుభూమిని గోపాల్ సాగుచేసుకుంటున్నాడు. ఈ భూమిని వేరొకరి పేరున 2022లో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అప్పటి నుంచి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వివరాలతో పాటు ‘‘ఈ రోజు ఇక్కడ న్యాయం జరగలేదు... నాకు అన్యాయం జరిగింది. ఇక్కడే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.’’ అంటూ అర్జీలోనే రాసి సమర్పించాడు. తన పాటు పురుగుల మందు డబ్బా తీసుకొచ్చాడు. గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివిధ సమస్యలపై 445 వినతులు


