
ఊరించి ఉసూరుమనిపించారు..
●పట్టుమని పది నెలల్లోనే టీడీపీకి దూరమైన ‘అనంతపురం’ నేతలు
●తాజాగా జరిగిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశానికి డుమ్మా
●అధిష్టానం సీరియస్‌గా ఉందని హెచ్చరించినా బేఖాతరు
●ఎన్నికల ముందు ఊరించి ఉసూరుమనిపించారంటూ ఆవేదన
●అన్ని ఆదాయ వనరులూ ఒకరికే చెందుతున్నాయని నిట్టూర్పు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో అప్పుడే అసమ్మతి సెగలు రేగాయి. కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే టీడీపికి చెందిన ముఖ్య నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత రెండు మాసాలుగా కేడర్‌కూ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేడర్‌లో ఏ ఒక్కరికీ పనులు కావడం లేదని, అన్నీ ఎమ్మెల్యే మనుషులకే దక్కుతున్నాయని, ఈ మాత్రం దానికి తామెందుకు పార్టీ కోసం కష్టపడాలని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సభ్యత్వ నమోదు కూడా తూతూమంత్రంగా జరిగినట్లు తెలిసింది.
సమావేశానికి రాంరాం..
రెండు రోజుల క్రితం అనంతపురం టీడీపీ పరిశీలకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. ఇందుకు అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులెవరూ హాజరు కాలేదు. మాజీ మేయర్ స్వరూప, సుధాకర్ నాయుడు, ఆదెన్న, బుగ్గయ్య, రాయల్‌మురళి, జేఎల్ మురళి వంటి వారు ఆ వైపు చూడలేదు. వీళ్లందరూ ఇటీవలి వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారే. అలాంటి నేతలు నేడు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.
మార్కెట్ యార్డు చైర్మన్‌గిరీ..
అన్ని చోట్లా వారికే..!
అనంతపురం మార్కెట్ యార్డ్ తనకే దక్కుతుందని టీడీపీకి చెందిన ఓ మహిళ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధికి రూ.65 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సదరు మహిళ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీని కమ్మ సామాజిక వర్గ నేతకే కట్టబెట్టారు. ఈ క్రమంలో అనంతపురంలో కూడా అదే సామాజిక వర్గ నేతకు పదవి ఎలా అప్పజెబుతారని కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ మహిళకు ఇవ్వకపోతే తన సమీప బంధువు కోనంకి గంగారాంకు పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్లు తెలిసింది. గంగారాం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు గుర్రుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదని బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా దగ్గుపాటి ప్రసాద్‌కు సొంత పార్టీలోనే బద్ధశత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
‘ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం.. ఎన్నికల ముందు మాకు ఎన్నో హామీలిచ్చారు. పదవులు ఇస్తామన్నారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త వ్యక్తి అయినా దగ్గరుండి గెలిపించాం.. కానీ ఇప్పుడు పదవులూ లేవు, ఆదాయమూ లేదు’ అంటూ ఓ టీడీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డామని.. అప్పులు చేసి ఖర్చు పెడితే ఇప్పుడా అప్పులకు వడ్డీలు కడుతున్నామని కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఒక నాయకుడు వాపో యారు. ‘ఆదాయమొచ్చే పనులు ఎమ్మెల్యేకు, కష్టం మాకా’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే పాల్గొంటున్న సమావేశాలకు వెళ్లడం లేదని మరో నాయకుడు తెగేసి చెప్పారు. కేడర్ ఎవరూ ఇష్టంగా పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమని కాపు సామాజిక వర్గ నేత చెప్పారు.