విద్యార్థిపై అడవి పంది దాడి
కంబదూరు: పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిపై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన శుక్రవారం కంబదూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గుండ్లపల్లి కాలనీకి చెందిన బొమ్మలాట ఆంజినేయులు కుమారుడు చరణ్ కంబదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా అడవి పంది అడ్డొచ్చింది. దీంతో చరణ్ కింద పడిపోయాడు. అతనిపై అడవి పంది దాడి చేయడంతో గట్టిగా కేకలు వేశాడు. చుట్టు పక్కల వారు కేకలు విని పరుగెత్తుకొచ్చి అడవి పందిని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె
అనంతపురం అర్బన్: శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు తమకు రావాల్సిన బకాయి వేతనాలు, పీఎఫ్ చెల్లించాలనే డిమాండ్‌తో శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు శ్రీరామిరెడ్డి నీటి సరఫరా పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు, అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చుక్కల భూముల
ఫైళ్లు పక్కాగా ఉండాలి
అనంతపురం అర్బన్: నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యలు పరిష్కరించే క్రమంలో వాటి ఫైళ్లు సమగ్ర వివరాలు, ఆధారాలతో పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో డీఎల్‌సీ (డాటెడ్ ల్యాండ్ కమిటీ) సమావేశం నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం పరిధిలో 22ఏ జాబితాలో నాలుగు కేసులను విచారించి, రెండు కేసులను ఆమోదించారు. మిగిలిన రెండింటిని తిరస్కరించారు. కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి రెండు కేసులను విచారణ చేసి, ఆమోదించారు. అనంతరం రాయదుర్గం మునిసిపాలిటీకి సంబంధించి డీఎల్‌ఎన్‌సీ (డిస్ట్రిక్ లెవల్ నెగోషియేషన్ కమిటీ) నిర్వహించి ఎకరాకు రూ.43 లక్షలు నిర్ణయించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, తహసీల్దార్లు భాస్కర్, పుణ్యవతి, మహబూబ్‌బాషా, నాగరాజు, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ ప్రభంజన్‌రెడ్డి, రాయదుర్గం మునిసిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిపై అడవి పంది దాడి


