త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన

Dec 28 2025 7:37 AM | Updated on Dec 28 2025 7:37 AM

త్రీట

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన

అనంతపురం క్రైం: అనంతపురం పోలీసులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించారు. చిన్న వివాదాన్ని తీవ్ర ఉద్రిక్త స్థాయికి తీసుకెళ్లారు. టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ ఈ వివాదానికి ఆజ్యం పోయగా.. త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ ఏకంగా నిప్పు రాజేశారు. పెద్దమనిషిగా సమస్యను పరిష్కరించాల్సిన డీఎస్పీ శ్రీనివాసరావు కూడా వచ్చీ రాగానే ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయకుండా ‘కొడుకులను ఈడ్చుకెళ్లి లోపలేయండి’ అంటూ దురుసుగా మాట్లాడారు.

ఏం జరిగిందంటే...

అనంతపురంలోని గుల్జార్‌పేటలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన కాంట్రాక్టరే ఈ పనులు చేస్తున్నాడు. ఇళ్ల ముందున్న మెట్లు, అరుగులు తొలగించే పనులు శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ పేరు రాసి, జెండా ఏర్పాటు చేసిన చిన్న సిమెంటు దిమ్మె కాలువ తీయడానికి అడ్డుగా ఉండడంతో దాన్ని తొలగించారు. అక్కడే పనులను పర్యవేక్షిస్తున్న గుల్జార్‌ పేట్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ముంతాజ్‌బేగం కుమారుడు దాదాపీర్‌ కావాలనే టీడీపీ దిమ్మెను తొలగింపజేశారని ఆరోపిస్తూ.. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరు వీడియో తీసి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టూటౌన్‌ పోలీసులు ఏకంగా దాదాపీర్‌పై కేసు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించాలని భావించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ఫోన్‌లో సమాచారం చేరవేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీనియర్‌ నాయకులు అనంత చంద్రారెడ్డి, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌గౌడ్‌, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి కార్యకర్తలతో కలసి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నాయకులను, కార్యకర్తలను సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ మెయిన్‌ గేటు వద్దే అడ్డుకోవడంతో అందరూ అక్కడే బైఠాయించారు.

పోలీసులు పక్షపాతం చూపుతున్నారు

పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీంతో పాటు రమేష్‌గౌడ్‌, సాకే చంద్ర, చింతా సోమశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్పొరేటర్‌ కుమారుడిని అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు. గతంలో మైనార్టీ మహిళ ఆత్మహత్యకు సంబంధించి ఫిర్యాదు చేస్తే స్పందించలేదన్నారు. పార్టీ నేత చింతకుంట మధు విషయంలోనూ అలాగే వ్యవహరించారన్నారు. జగనన్న జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను టీడీపీ వారు కావాలనే కోసేశారని, తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులను చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు దౌర్జన్య పరులు, కబ్జాదారులు, సెటిల్‌మెంట్లు చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి, జిల్లా బూత్‌ కన్వీనర్‌ ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి, రాష్ట్ర మైనార్టీ ప్రధానకార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, కార్పొరేటర్లు ముంతాజ్‌బేగం, అబ్దుల్‌ సాలేహా, కమల్‌భూషణ్‌, అనిల్‌కుమార్‌, రహంతుల్లా, ఇషాక్‌, శేఖర్‌బాబు, పార్టీ నాయకులు రాజ్‌కుమార్‌, రాధాకృష్ణ, దాదా ఖలందర్‌, వినీత్‌, నాగర్జునరెడ్డి, చింతకుంట మధు, మహేశ్వరి, ఓబుళేసు, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులతో దురుసుగా మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను నెట్టేస్తున్న పోలీసులు,

స్టేషన్‌ ఆవరణలోకి కూడా రానివ్వకుండా, కనీసం విషయం ఆరా తీయకుండా సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ గేటు వద్దే అడ్డుకోవడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పు బట్టారు. ఇంతలోనే త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ అక్కడికి వచ్చారు. వచ్చీ రాగానే ‘ఏం స్టేషన్‌ ముందు కూర్చుంటారా? మీరన్న ఇంతమందే వచ్చారు..నేను అనుకుంటే 300 మందినైనా దించి చూపిస్తా’ అంటూ రెచ్చిపోయారు. విషయం చెబుతున్న సీనియర్‌ నేత అనంత చంద్రారెడ్డి, సాకే చంద్రశేఖర్‌లను ‘ఏయ్‌.. ఏం చెయ్యి చూపిస్తావా’ అంటూ ఏక వచనంతో బూతులు తిట్టడం ప్రారంభించారు. దీంతో కార్యకర్తలు సీఐ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సీఐలు రాజేంద్రనాథ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌ యాదవ్‌ మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగి పెద్దమనిషిలా వ్యవహరిస్తారని చూస్తే ఆయన కూడా వారిబాటలోనే నడిచారు. ‘కొడుకులను లోపలేయండి’ అంటూ మాట్లాడారు. చివరకు జిల్లా ఎస్పీ జగదీష్‌ జోక్యం చేసుకుని వివాదం మరింత పెద్దది కాకుండా చూశారు. ఆయన ఆదేశాలతో స్టేషన్‌లోకి నేతలను పిలిచి మాట్లాడి పంపించారు.

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ కుమారుడి అక్రమ అరెస్టు

పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతలను అడ్డుకున్న టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌

దీంతో గేటు ముందు బైఠాయించిన నేతలు, కార్యకర్తలు

రంగంలోకి త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌.. వచ్చీ రావడంతోనే ‘నా కొడుకులు’ అంటూ దూషణ

డీఎస్పీ శ్రీనివాసరావుదీ అదే తీరు

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన 1
1/2

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన 2
2/2

త్రీటౌన్‌ సీఐ దురుసు ప్రవర్తన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement