శ్రుతిమించిన టీడీపీ నేతల ఆగడాలు
అనంతపురం అర్బన్: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, మంత్రి పయ్యావుల కుటుంబం అండతో విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ పొలంలోని భూమిని ఆక్రమించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని అడ్వకేట్ హరినాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేవీ రమణతో పాటు బాధితులతో కలిసి కలెక్టర్ ఆనంద్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వేల్పులమడుగు గ్రామ సర్వే నంబరు 141లోని 42.21 ఎకరాల్లో 21.05 ఎకరాలను 2023 జూన్ 24న (3430/2023, 3441/2023) రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా జయకుమార్ కొనుగోలు చేశాడని చెప్పారు. అనంతరం విడపనకల్లు తహసీల్దార్ ధ్రువీకరించి టైటిల్ డీడ్, పట్టాదారు పాసుపుస్తకం, అడంగల్, 1బీ జారీ చేశారని తెలిపారు. భూ యజమానిగా జయకుమార్ అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో కందిపంట సాగు చేశారని, పంట విత్తిన తరువాత జనార్దనపల్లికి చెందిన ఆర్.జనార్దన్, కృష్ణమూర్తి, సుధాకర్, పాండురంగ, తదితరులు చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దీంతో బాధితుడు అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ముందు ఓఎస్ నంబరు 117/2025 దాఖలు చేశాడన్నారు. న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు 13న ‘ఐఏ నంబరు 241/2025) మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసిందన్నారు. అయినా కబ్జాకు యత్నించిన వ్యక్తులు భూ యజమానిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.
తప్పుడు నివేదికలతో పక్కదారి
నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూ యజమానిని తన భూమిలోకి ప్రవేశించకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి విడపనకల్లు ఎస్‌ఐ, ఉరవకొండ సీఐలు అడ్డుకుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. భూ వివాదంపై తహసీల్దార్ విచారణ చేసి ఈ ఏడాది సెప్టెంబరు 4న ఎండార్స్‌మెంట్ ఇచ్చారన్నారు. ఆ భూమి జయకుమార్ పేరున ఉందని, రెవెన్యూ శాఖకు జ్యోకం చేసుకునే అధికారం లేదని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తహసీల్దార్ తన నివేదికను తానే మార్పు చేశారన్నారు. ధూప, దీప, నైవేద్యం కోసం భూమిని దానం చేశారని, జనార్దనపల్లికి చెందిన జనార్దన్ ఆ భూమిని సాగు చేస్తున్నారని ఈ నెల 22న తాజాగా నివేదిక సమర్పించారని చెప్పారు. దీంతో బాధిత రైతు హైకోర్టులో రిట్ పిటీషన్ (35899/2025) దాఖలు చేశాడన్నారు. ఈ వివాదం పూర్తిగా సివిల్ స్వభావాన్ని కలిగి ఉందని హైకోర్టు ఉత్తర్వు ద్వారా నిర్ధారించిందని, పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందని వివరించారు. అయినా ఈ నెల 26న భూ యజమాని, ఆయన మామ లత్తవరం గోవిందు, వ్యవసాయ కార్మికులు పంట కోతకు వెళితే పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి అక్రమంగా అడ్డుకున్నారన్నారు. దీంతో 21 ఎకరాల్లోని పంట నాశనం అవడం వల్ల భూ యజమానికి దాదాపు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీకి, పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న పయ్యావుల కేశవ్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
పయ్యావుల అండతోనే భూ ఆక్రమణ
కోర్టు ఆర్డరును సైతం లెక్క చేయడం లేదు
బాధితులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి


