బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల నాయకుడు యశంత్ డిమాండ్ చేశారు. సమస్యలపై బుధవారం వర్సిటీ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు దఫాలుగా వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కలేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజులు తగ్గించాలని అనేక మార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు ఒకే పరిధిలో ఉంటాయని, అయితే ఇతర ప్రాంతాల్లోని వర్సిటీల్లోని ఫీజులకు అనంతపురంలోని వర్సిటీలోని ఫీజులకు రూ.వేలల్లో వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు వెంకట్రావ్, యశ్వంత్, విలియం, ధనరాజ్, రాము, అమరేష్, అమర్, ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.