31 వరకు పశువైద్య శిబిరాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాక జేడీ డాక్టర్ ప్రేమ్‌చంద్ తెలిపారు. సోమవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీ డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ డాక్టర్ జి. వెంకటేష్, ఏడీలు శ్రీనివాసరావు, రాధిక, వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్‌మన్ తదితరులతో కలసి ఆయన పోస్టర్లు విడుదల చేసి మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు బృందాలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముందరోజు ఆ గ్రామంలో దండోరా వేస్తారని, పాడి రైతులు, జీవాల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బావిలో పడి యువకుడి మృతి
కుందుర్పి: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కుందుర్పి మండలంబెస్తరపల్లికి చెందిన గోవిందప్ప కుమారుడు రవికుమార్ (33) అవివాహితుడు. ఏడాదిగా మతి స్థిమితం లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నెల11న బహిర్భూమికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన రవికుమార్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. సోమవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహం తేలియాడుతుండడం గమనించిన గొర్రెల కాపర్ల సమాచారంతో గ్రామస్తులు వెళ్లి పరిశీలించారు. ఆనవాళ్లను బట్టి రవికుమార్‌గా గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెంది ఉంటాడని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిట్టి చేతులు..
బరువైన పనులు
బొమ్మనహాళ్: విద్యాబుద్ధులు నేర్పించే గురువులు గతి తప్పారు. బరువైన పనులను చిన్నారులతో చేయించి వివాదానికి తెరలేపారు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలను తెరిచారు. అయితే దుమ్ముతో పేరుకుపోయిన బెంచీలను చిన్నారులతో బయటకు మోయించారు. వాటిని శుభ్రం చేయించి, తడి బట్టతో తుడిపించి, తిరిగి తరగతి గదుల్లోకి మోయించారు. బరువైన బెంచీలను మోయలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బరువైన పనులను ఇతరులతో చేయించకుండా చిన్నారులతో చేయించడం వివాదానికి తెరదీసింది. మోయలేని స్థితిలో బెంచీ విద్యార్థుల కాళ్లపై పడితే బలమైన గాయం కావడం ఖాయమని, ఈ పనిని చిన్నారులతో కాకుండా ఇతరులెవరితోనైనా చేయించి ఉంటే బాగుండునని పలువురు పేర్కొన్నారు.
31 వరకు పశువైద్య శిబిరాలు


