ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాల దహనం
అనంతపురం అర్బన్: మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ తీరును ఆక్షేపిస్తూ ఏపీ మహిళా సమాఖ్య నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ ముస్లిం మహిళపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం అనంతపురంలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పార్వతీప్రసాద్, పద్మావతి మాట్లాడారు. మహిళలను అత్యంత అభినంగా గౌరవించిన గొప్ప నాయకుడు ఎన్‌టీరామారావు అని, అలాంటి మహానుభావుడి వారసులు గా చెప్పుకుంటూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దగ్గుపాటి క్షమార్హుడని పేర్కొన్నారు. ఆయన ఇంట్లోనూ మహిళలు ఉంటారనే కనీస విచక్షణ, విజ్ఞత లేకుండా మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఽభూకబ్జాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, మద్యం దందాలు, మహిళలకు కనీస గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడని అన్నారు. దగ్గుపాటి తీరుపై ఈ నెల 21న విజయవాడలో మహిళా కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేత వరలక్ష్మి, నగర అధ్యక్షురాలు యశోదమ్మ, ఆజాబీ, ప్రమీల, జానకి, హసీనా, లీల, మస్తానమ్మ, పాల్గొన్నారు.


