ఉపాధి చట్టం పేరు మార్పు తగదు : సీపీఎం
గుత్తి/రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు తగదని, ఆ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. గుత్తిలో సోమవారం ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద బైక్ ర్యాలీని రాంభూపాల్ ప్రారంభించి, మాట్లాడారు. గుత్తి నుంచి ఊటకల్లు వరకూ బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఊటకల్లు, బేతాపల్లి, యంగన్నపల్లి, ధర్మాపురం, బాచుపల్లి, కరిడికొండ గ్రామాల్లో ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి నిర్మల, సీనియర్ నాయకులు రేణుక, రేవతి, మల్లికార్జున, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బెళుగుప్పలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
బెళుగుప్ప: స్థానిక వెంకటనాయుడు రైస్ మిల్లు వద్ద కందుల కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి ఫృథీసాగర్ సోమవారం ప్రారంభించారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని చంద్రబాబు సర్కార్ తీరుపై ‘మద్దతు ఇవ్వని బాబు సర్కార్’ శీర్షికన ఈ నెల 14న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి అధికారులు స్పందించి, కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. క్వింటా రూ.8వేల మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు వర్తిస్తాయన్నారు.
అరటి పంటకు నిప్పు
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాటిల్ చంద్రశేఖర్‌రెడ్డి తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోటకు సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతుల నుంచి సమాచారం అందుకున్న బాధిత రైతు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో మంటలు ఆర్పే లోపు రెండు ఎకరాల్లోని 300 చెట్లు, అరటి గెలలు కాలిపోయాయి. మరో రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణంలో నిప్పు పెట్టడంతో రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కుట్ర అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అండ చూసుకుని కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధి చట్టం పేరు మార్పు తగదు : సీపీఎం
ఉపాధి చట్టం పేరు మార్పు తగదు : సీపీఎం
ఉపాధి చట్టం పేరు మార్పు తగదు : సీపీఎం


