మంత్రా.. మజాకా!
● మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ భవనాలు
● ఉన్నఫళంగా ఖాళీ చేయించిన వైనం
ఉరవకొండ: ‘ఎవరేమనుకున్నా.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడినా... మేము మారము. మేమింతే’ అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ తనదైన మార్క్‌ను బయటపెట్టుకున్నారు. మంత్రా.. మజాకా అనే రీతిలో ఉన్నఫళంగా ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించి తన క్యాంప్ కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఇందుకు ఉరవకొండలోని వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భవనం వేదికగా మారింది. పాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్ పాలకులు కట్టించిన ఈ భవనాలు నేటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా ఈ భవనాల్లో రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ భవనాల్లోనే వీఆర్‌ఓల కార్యాలయం కూడా ఉంది. మంత్రి క్యాంపు కార్యాలయానికి పట్టణంలో చాలా భవనాలు అందుబాటులో ఉన్నాయి. అయినా పట్టుబట్టి ఈ భవనాలనే ఎంచుకుని మరీ ఖాళీ చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రి పోరు పడలేక అధికారులు తలలు పట్టుకున్నారు. గత్యంతరం లేని స్థితిలో కొన్నేళ్లుగా మూతపడిన ఉరవకొండ సబ్ జైలు భవనంలోకి రెవెన్యూ రికార్డులను చేర్చారు. ప్రస్తుతం సబ్ జైలు భవనంలోనే రెవెన్యూ అధికారులు విధులు నిర్వర్తిస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్ పక్కన ఉన్న పురాతన భవనంలోకి రాత్రికి రాత్రే మార్చేశారు. గతంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ రెండు కార్యాలయాలు ఎంతో అనువుగా ఉండేవి. ప్రస్తుతం ఈ రెండు కార్యాలయాలను సుదూరంగా మార్చేడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొంటున్నారు.
మంత్రా.. మజాకా!
మంత్రా.. మజాకా!


