రాష్ట్రంలో రాక్షస పాలన
● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్
శింగనమల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేసి చంద్రబాబు వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మండలాల అధ్యక్షులు, మండల అబ్జర్వర్లు, క్లస్టర్ గ్రామ పంచాయతీ అబ్జర్వర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం.మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. పిన్నెళ్లిలో దళిత కార్యకర్త సాల్మన్ మృతి ఘటనలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ సహించదన్నారు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేక వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచేలా సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ స్థాయిలో బాధ్యతలు, స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండేలా సంస్థాగత కమిటీలు పనిచేస్తాయన్నారు. ఈ నెల 25న గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్‌లో ఉన్న టీ కన్వెన్షన్ హాల్‌లో శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల వంశీగోకుల్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, జెడ్పీటీసీ నీలం భాస్కర్, మండల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఖాదర్‌వలి ఖాన్, యల్లారెడ్డి, మహేశ్వరరెడ్డి, శివశంకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాలు, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


