టమాట రైతులు ఆశ – నిరాశ నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. అలా
అనంతపురం అగ్రికల్చర్: టమాట ధరలు మళ్లీ పడిపోయాయి. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. సీజన్ ఆరంభం అంటే గత జూన్, జూలై, ఆగస్టులో ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో మార్కెట్ పరిస్థితి తారుమారైంది. ధరలు అమాంతం పడిపోయాయి. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్‌లో ధరలు పుంజుకున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 40,130 ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగయ్యింది. ఇప్పుడు మార్కెట్ మళ్లీ నేలచూపు చూస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్‌టో 15 కిలోల టమాట బాక్సు ధర గరిష్టంగా రూ.270 ఉండగా.. సగటు ధర రూ.180, కనిష్టం రూ.100 పలుకుతోంది. తేమ ఉన్నవి, మచ్చ వచ్చిన కాయలను కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటివి బాక్సు రూ.50 కూడా పలకడం లేదు. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకు మాత్రమే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100 నుంచి రూ.200 మధ్య పలుకుతుండంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రోజూ మార్కెట్‌కు 1,500 నుంచి 2 వేల టన్నుల వరకు టమాట వస్తోంది.
గిట్టుబాటు కాని ధరలు
ఎకరాకు 15 నుంచి 18 టన్నుల వరకు టమాట దిగుబడి వస్తోంది. కట్టెలు, తీగలు కట్టిన పొలంలో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే రూ.60 వేల వరకు పెట్టుబడి వస్తోంది. కిలో రూ.22 నుంచి రూ.25 పలికితే పెట్టుబడి పోయి కొంత వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధరలు చూస్తే కూలీలు, రవాణా, మార్కెట్‌లో కమీషన్లకు కూడా చాలడం లేదంటున్నారు. ఈ ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లా పరిధిలో టమాట అమ్మకాలు సాగిస్తున్న అన్ని మార్కెట్లలో ధరల పరిస్థితి ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ధర లేక ఆత్మకూరు వద్ద రోడ్డు పక్కన పడేసిన నాణ్యమైన టమాటాలు
పది రోజులుగా ధరలు పతనం
15 కిలోల బాక్స్ సగటు ధర రూ.180
కనిష్ట ధర రూ.100కు పడిపోవడంతో రైతులకు నష్టాలు


