విజయవంతంగా కుక్కల నియంత్రణ
అనంతపురం క్రైం: ప్రజల భద్రత, జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సంతాన నివారణ కింద చేపట్టిన రెండు విడతలు విజయవంతమయ్యాయని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ తెలిపారు. మంగళవారం నగరంలోని గుత్తి రోడ్డులో గల స్నేహ్ సంస్థ సెంటర్‌ను పలు శాఖల అధికారులతో కలసి వారు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో 4,900 వరకు కుక్కలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. సంతాన నివారణతో కుక్కల బెడద తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కుక్కల సంతాన నియంత్రణ బాధ్యతను స్నేహ్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 34 రోజుల వ్యవధిలో 917 వీధికుక్కలకు నియంత్రణ చికిత్సలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక రాయదుర్గం పట్టణంలో 199, కళ్యాణదుర్గంలో 162, తాడిపత్రిలో 308 వీధికుక్కలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గుత్తిలో కుక్కల పూర్తి వివరాల సేకరణ జరుగుతోందన్నారు. గుంతకల్లులో 259 వీధికుక్కలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కుక్కల సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు, యాంటీ–రేబీస్ టీకాలు, ఆరోగ్య పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. జంతువులపై హింసకు తావులేకుండా, శాసీ్త్రయ విధానంలో కుక్కల సంతాన నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్– ఏబీసీ) కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలు ఎక్కడైనా పెంపుడు కుక్కలను ఎక్కడ పట్టుకుపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంతాన నియంత్రణ చికిత్స చేసి, మంచి ఆహారం అందించి, అనంతరం తిరిగి ఎక్కడ కుక్కలను అక్కడ వదిలేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ స్పష్టం చేశారు.


