సిలిండర్ డెలివరీలో అవకతవకలు
● గ్యాస్ ఏజెన్సీకి రూ.10 వేల జరిమానా
బొమ్మనహాళ్: గ్యాస్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ శంకర్ మంగళవారం బొమ్మనహాళ్‌లో తనిఖీలు నిర్వహించారు. సిలిండర్ డెలివరీ వాహనంలో తూకం వేసే మిషన్ లేకపోవడంతో పాటు గ్యాస్ సరఫరా ధ్రువీకరణ పత్రం చూపించడంలో గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం బయటపడింది. దీంతో రూ.10 వేలు జరిమానా విధించారు. నిర్దేశించిన ధర కన్నా సిలిండర్‌పై అధికంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద డెలివరీ చేయాల్సిన సిలిండర్లను రోడ్డుపైనే వదిలేస్తున్నారని, బలహీనులు, వృద్ధులు సిలిండర్లను మోసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉన్నవారికి 10 నుంచి 20 సిలిండర్లు ఇస్తున్నారని, ఇష్టారాజ్యంగా విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ మరోసారి సిలిండర్ల డెలివరీలో అవకతవకలకు పాల్పడితే ఏజెన్సీ రద్దు కోసం ఉన్నతాధికారుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. బొమ్మనహాళ్‌లో సిగరేట్ ప్యాకెట్ ధర రూ.100 ఎమ్మార్పీ ఉంటే.. అదనంగా రూ. 20 వసూలు చేస్తున్న వారికి రూ.5 వేల జరిమానా ఆన్‌లైన్ ద్వారా కట్టించినట్లు వెల్లడించారు. శ్రీధరఘట్టలో త్రాసుకు లీగల్ మెట్రోలజీ శాఖ ముద్ర అనుమతి పత్రాలు లేనందున కేసు నమోదు చేసి, రూ.5 వేలు జరిమానా వేశామన్నారు. బొమ్మనహాళ్‌లో వ్యాపారుల తూనికలు, కొలతల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ శిబిరం నిర్వహించారు. వ్యాపారులందరూ తమ తూనిక, కొలతల యంత్రాలు ఏటా తప్పని సరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.


