కుక్కలను తప్పించబోయి యువకుడి మృతి
రాప్తాడు రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం పి.అనంతపురం గ్రామానికి చెందిన రామచంద్రుడు, నాగలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు ఎక్కలూరి శ్రీకాంత్ (25) నాలుగేళ్లుగా అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి సమీపంలోని ఎస్‌ఆర్ బాలుర జూనియర్ కళాశాల మెస్ ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్నాడు. రెసిడెన్షియల్ బ్రాంచ్ కావడంతో అక్కడే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై అనంతపురానికి వచ్చి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. కొడిమి క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఘటనతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను అటుగా వెళ్తున్న వారు గమనించి 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


