తాడిపత్రిలో అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం
తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుట్టుచప్పుడు కాకుండా వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు ఫయాజ్‌బాషాను అనంతపురం తరలించారు. ఇటీవల ఫయాజ్‌బాషా తన నూతన గృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులను ఉసిగొల్పారు. ఇదే అదునుగా ఫయాజ్ ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు రాళ్లదాడి చేశాయి. అయినా, దాదాపు 17 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపైనే పోలీసులు కేసులు నమోదు చేసి స్వామి భక్తిని ప్రదర్శించారు. తాజాగా ఆయన్ను పండుగ పూట కూడా ఇంట్లో ఉండకుండా చేయడం గమనార్హం. దాదాపు 60 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఫయాజ్ బాషా ఇంటిని చుట్టుముట్టి తమ జీపులోనే అనంతపురం తరలించారు. 10 రోజుల పాటు తాడిపత్రికి రావొద్దంటూ హుకుం జారీ చేశారు.రంజాన్ వేళ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారన్న నెపంతో తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని 9 నెలలుగా తాడిపత్రికి రాకుండా చేసిన పోలీసులు..ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఫయాజ్‌బాషాను పట్టణం నుంచి తరలించి జేసీ ఆగడాలకు రూట్‌క్లియర్ చేస్తున్నారంటూ పట్టణ వాసులు మండిపడుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఫయాజ్‌బాషాను అనంతపురం తరలింపు
ఖాకీల తీరుపై
పట్టణవాసుల మండిపాటు


