అనంతపురం: పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం స్పెషల్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎనుమలవారిపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు వీరానిపల్లి చిరంజీవి (22) ఓ బాలికను ఇంటి వద్ద వదిలిపెడతానని తన ఆటోలో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్‌లో 2019 మార్చి 22న కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీఐ బి.వెంకట చలపతి కేసు దర్యాప్తు చేశారు. అనంతరం సీఐ టి.మధు జిల్లా సెషన్స్ కోర్టులో నిందితుడు వీరానిపల్లి చిరంజీవి అలియాస్ చిరుపై చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసును అనంతపురం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం ఈ కేసును ట్రయిల్ చేసి మొత్తం 14 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి వీరానపల్లి చిరంజీవి అలియాస్ చిరుకు 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక న్యాయ స్థానం (పోక్సో కోర్టు) శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.3లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ, విద్యాపతి వాదించారు.


