ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో వెడల్పు చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. అలాగే పంట కాలువలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. ఉరవకొండ మండలం ఇంద్రావతి, ముష్టూరు గ్రామాల్లో హంద్రీ–నీవా కాలువను సోమవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరులే కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు ప్రారంభించే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు పది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత డిజైన్ 3,850 క్యూసెక్కుల కంటే తక్కువకు కుదించి లైనింగ్ పనులు చేపడితే అది రైతులకు మరణశాసనమవుతుందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చడంతో పాటు హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. ఈ విషయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి, మధుసూదన్, శ్రీనివాసులు, కౌలు రైతు సంఘం నాయకులు పెద్దముష్టూరు వెంకటేష్, మురళి, రామాంజినేయులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్


