గార్లదిన్నె/అనంతపురం సిటీ: ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామానికి చెందిన గోపు ఆనంద్‌రెడ్డి(29) తల్లిదండ్రుల మృతి అనంతరం తన అన్న సాయిప్రతాపరెడ్డి కుటుంబంతో కలసి జీవిస్తున్నాడు. డిప్లొమా వరకు చదువుకున్న ఆనందరెడ్డి జేసీబీ పెట్టుకొని, అన్నతో కలసి తమకున్న పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేసేవాడు. ఈ క్రమంలో పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు మూటగట్టుకున్నాడు. దీంతో పంటల సాగుకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చే మార్గం కానరాక మద్యానికి బానిసైన ఆనందరెడ్డి... మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు. అర్ధరాత్రి సమయంలో గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లి సమీపంలో పట్టాలపైకి చేరుకుని గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముక్కలైన మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సాయిప్రతాపరెడ్డి మార్చురీకి చేరుకుని మృతుడిని ఆనందరెడ్డిగా ధ్రువీకరించాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


