
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్)
● ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాల విడుదల
● తొలిసారి 23 రోజుల్లోనే ఫలితాలు
● ఒకేసారి ప్రథమ, ద్వితీయ
సంవత్సర ఫలితాలు ప్రకటించనున్న ఇంటర్ బోర్డు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ వార్షిక పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, కళాశాలల యాజమాన్యాల ఉత్కంఠకు శుక్రవారం తెర పడనుంది. ఇంటర్ బోర్డు చరిత్రలోనే తొలిసారి పరీక్షలు ముగిసిన కేవలం 23 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తోందని అధికారులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు చెబుతున్నారు. ఇదొక రికార్డ్‌గా అభివర్ణిస్తున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేమారు విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
పరీక్షలు రాసిన 41,556 మంది విద్యార్థులు
జిల్లాలో 170 జూనియర్ కళాశాలల నుంచి రెగ్యులర్, ఒకేషనల్ వార్షిక పరీక్షలు 41,556 మంది రాశారు. వీరిలో 24,446 మంది మొదటి సంవత్సరం, 17,110 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 21న మూల్యాంకనం ప్రారంభం కాగా ఈనెల 4 నాటికి పూర్తయింది.
పకడ్బందీగా నిర్వహణ
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ విధానంపై పటిష్ట నిఘా ఉంచారు. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించారు. టెక్నాలజీ సాయంతో పరీక్ష పత్రాలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించి లీకేజీలకు అడ్డుకట్ట వేశారు.ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ నమోదు నుంచి ఎగ్జామ్ సెంటర్ల వరకు అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని బోర్డు వినియోగించింది. గతంలో ఇంటర్ పరీక్ష ఫీజు చలానా రూపంలో విద్యార్థులు చెల్లించేవారు. వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. ఈ ఏడాది ఆన్‌లైన్ విధానం తీసుకురావడంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షకు కూడా ఈసారి సాంకేతికతను వినియోగించారు. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే మార్కులను బోర్డు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మార్కుల విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు.