పీఏబీఆర్‌లో 2.37 టీఎంసీల నీరు

- - Sakshi

కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో పూర్తి బంద్‌ అయ్యింది. డ్యాం వద్ద ఏర్పాటు చేసిన సత్యసాయి, అనంతపురం, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టులకు రోజూ సుమారు 60 క్యూసెక్కులు, లీకేజీలు, ఇతరత్ర కింద 110 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. ఆదివారం నాటికి జలాశయంలో 2.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్‌ జేఈఈ లక్ష్మీదేవి తెలిపారు. ఇన్‌ఫ్లో బంద్‌ అయినప్పటికీ తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరతేమీ ఉండదన్నారు. 1.5 టీ ఎంసీల నీరు నిల్వ ఉన్నా ప్రాజెక్టులకు నీటి సమస్య ఉండదని ఆమె స్పష్టం చేశారు.

అక్రమ మద్యం

నియంత్రణకు చర్యలు

అనంతపురం క్రైం: అక్రమ మద్యం నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాబాలు, హోటళ్లలో పోలీసులు ఆదివారం దాడులు చేపట్టారు. హోటళ్లు, డాబాల్లో మద్యం విక్రయించడం, అనుమతించడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా అక్రమంగా మద్యం వినియోగానికి అనుమతి లేకుండా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆదివారం తనిఖీలు చేపట్టారు. పార్కులు, శివారు ప్రదేశాలు, వల్నరబుల్‌ ప్రాంతాల్లో మద్యం వినియోగించకుండా ప్రత్యేక నిఘా వేశారు. జిల్లాలోకి కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలు జరగకుండా జిల్లా అంతటా వాహనాల తనిఖీలు, దాడులు చేపట్టారు. పలు లాడ్జీల్లో తనిఖీలు చేశారు. బస చేసే వ్యక్తులు అనుమానాస్పదమని భావిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు.

నేడు కేంద్ర బృందం రాక

అనంతపురం అగ్రికల్చర్‌: కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన జాయింట్‌ సెక్రెటరీ పంకజ్‌ యాదవ్‌ నేతృత్వంలో 10 మంది ఉన్నతాధికారులతో కూడిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (కేంద్ర కరువు బృందం) సోమవారం రాత్రి అనంతపురం రానుందని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం జిల్లా అధికారులతో కరువు పరిస్థితులపై సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మూడు బృందాలుగా విడిపోయి ఒక బృందం కామారుపల్లి, కురుగుంట, పామిడి మండలం ఎద్దులపల్లి, అనుంపల్లి గ్రామాల్లో పర్యటించనుంది. రెండో బృందం రాయదుర్గం మండలం ఆవులదట్ల, జుంజురాంపల్లి, కళ్యాణదుర్గం మండలం చాపిరి, గరుడాపురం గ్రామాల్లో, మూడో బృందం ఉరవకొండ మండలం ఆమిద్యాల, రాకెట్ల, ఆత్మకూరు మండలం తలుపూరు, తోపుదుర్తి గ్రామాల్లో పర్యటించనున్నాయి. మూడు బృందాలు రాత్రికి అనంతపురం చేరుకుంటాయి. 13, 14 తేదీల్లో మూడు బృందాలు అన్నమయ్య, ఎన్టీఆర్‌, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కరువు పరిస్థితులు తెలుసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top