సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని పేదలందరికీ అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రే పెద్ద దిక్కు. ఇక్కడ అన్నిరకాల స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ జబ్బులు, దీర్ఘకాలిక రోగాలు, అత్యవసర సేవలకు ఉచితంగా ఖరీదైన, నాణ్యమైన వైద్యం అందిస్తారు. అయితే గత కొన్ని నెలలుగా సర్వజనాస్పత్రికి వస్తున్న రోగులను ప్రైవేట్ ఆస్పత్రులు గద్దల్లా తన్నుకుపోతున్నాయి. ఇందుకు సర్వజనాస్పత్రికి చెందిన కొందరు ఎంఎన్‌ఓలు, డాక్టర్లు, మీడియా ప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాయి. వీరంతా పేషెంటు రాగానే ‘ఇక్కడ వైద్య సేవలు బాగలేవు’ అని భయపెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు పంపడం నిత్యకృత్యమైంది. ఇలా పంపిన కేసులు ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ అవగానే సదరు సిఫార్సుదారులకు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఫోన్ పే ద్వారా ‘నజరానాలు’ అందుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.
ఆరంభంలోనే భయపెట్టేస్తారు
సాధారణంగా ప్రమాద కేసులన్నీ 108 వాహనంలో ఆస్పత్రికి వస్తాయి. పేషెంటును కిందకు దించగానే ఎంఎన్‌ఓలు, కొంతమంది మీడియా ప్రతినిధులు, ఒకరిద్దరు డాక్టర్లు వెంటనే పేషెంటు బంధువులను భయపెడతారు. ఇక్కడ బెడ్‌లు లేవనో, డాక్టర్లు లేరనో చెబుతారు. ఆ మరుక్షణమే బయటే కాచుకుని ఉన్న ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు లోపలకు వస్తారు. పేషెంటును వెంటనే ఎక్కించుకుని ‘సిబ్బంది’ చెప్పిన ప్రైవేటు ఆస్పత్రికి చేరుస్తారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద చేర్చినా అప్రువల్ వచ్చే వరకూ టెస్టులు, ఎక్స్‌రేలు, స్కానింగులు అంటూ రూ.10 వేలు తక్కువ కాకుండా వసూలు చేస్తారు.
కాసుల కోసం కక్కుర్తి
శవాలమీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే. ప్రమాదాలు లేదా అత్యవసర చికిత్సలో భాగంగా వచ్చే పేద రోగులను ఇక్కడ కొంతమంది దోచుకుతింటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది మీడియా ప్రతినిధులపై గతంలో ఒక వైద్యుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అధికారులకు తెలిసినా...
ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ తతంగం తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. స్వయానా సూపరింటెండెంట్‌కు ఈ వ్యవహారం తెలిసినా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఒకదశలో ఆర్‌ఎంఓలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో సామాన్యులు సూపరింటెండెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా తగ్గిన ఆరోగ్యశ్రీ కేసులు
ఆరోగ్యశ్రీ కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా పెరగాలని ప్రభుత్వం ఆదేశించినా ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కేసులు సర్వజనాస్పత్రికి పూర్తిగా తగ్గిపోతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కేసులు 67.62 శాతం ప్రైవేటుకు వెళుతున్నాయి. సర్వజనాస్పత్రికి 27 శాతం కేసులు మాత్రమే వస్తున్నాయి.
నెల క్రితం రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడి సర్వజనాస్పత్రికి వచ్చారు. ఇక్కడ సరిగా వైద్యం అందదని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లండని ఎమర్జెన్సీ వార్డు దగ్గరే కొందరు చెప్పి వెనక్కు పంపించారు. బాధితుడు ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజులుండి అక్కడ కోలుకోలేక తిరిగి సర్వజనాస్పత్రికి వచ్చి చేరాడు. ఇక్కడే వైద్యం పొంది డిశ్చార్జి అయ్యారు.
వారం క్రితం ఉరవకొండకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళుతూ కిందపడి తీవ్రగాయాలతో అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చారు. మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యింది. ఈ సర్జరీలు అక్కడ బాగా చేస్తారని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించినప్పటికీ అతని నుంచి అదనంగా డబ్బు వసూలు చేశారు.


