అనంతపురం: స్వయం సహాయక సంఘాలు/ డ్వాక్రాలో అక్కచెల్లెమ్మలు చేసుకునే పొదుపు.. పొందే రుణాలు.. చెల్లించే కంతుల్లో అవకతవకలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ‘స్మార్ట్’ ఆర్థిక లావాదేవీలతో పారదర్శకతకు పెద్ద పీట వేస్తోంది. ఈ విధానం వల్ల సమయం ఆదా అవడంతో పాటు ఆర్థిక లావాదేవీలు పక్కాగా ఉంటాయి. డ్వాక్రా సభ్యులు కూడా డిజిటల్ పేమెంట్స్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
పారదర్శకంతో జవాబుదారీతనం
సీ్త్ర నిధి ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) సభ్యులకు జీవనోపాధి రుణాలు మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్రనిధి రుణాలు రూ.147 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.74 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ రుణాల పంపిణీలో అవకతవకలు లేకుండా, సొమ్ము రికవరీ పకడ్బందీగా జరిగేలా ‘ఆటో డెబిట్’ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సీ్త్రనిధి రుణాలు పొందిన సభ్యులు నెలవారీ కంతు (ఈఎంఐ) పద్ధతిలో ఆటో డెబిట్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్దేశించిన రోజులోపే పొదుపు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జమ చేసిన మొత్తం ఆటో డెబిట్ విధానంలో నేరుగా పొదుపు సంఘం ఖాతా నుంచి సీ్త్ర నిధి ఖాతాకు జమ కానుంది. ఈ తరహాలోనే సభ్యులకు రుణాలు జమ చేస్తారు. ఈ విధానంలో పారదర్శకతతో పాటు సభ్యుల చెల్లింపుల వివరాలు పూర్తిగా సంఘం స్థాయిలోనే సభ్యులందరికీ తెలియజేస్తారు. జవాబుదారీతనం పెంపొందుతుంది. నిర్దేశిత తేదీ నాటికి కచ్చితంగా కంతు చెల్లించడం వల్ల సభ్యులకు వడ్డీభారం తగ్గుతుంది.
● ఇప్పటి వరకు ఆటోమేటిక్ డెబిట్ విధానం వల్ల రుణాల మంజూరులో 1800కు పైగా సంఘాలకు సంబంధించి రూ.36 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి.
వీఓఏలకు శిక్షణ పూర్తి
● డ్వాక్రా సంఘాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద బుక్కరాయసముద్రం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండలంలోని వీఓఏలకు డీఆర్‌డీఏ అధికారులు పేటీఎం స్కానర్లను అందజేశారు. ఈ మేరకు ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. గ్రామైక్య సంఘాలు తమ పరిధిలోని గ్రామ సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పిస్తారు. నేరుగా మహిళలు వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ విధానంతో డిజిటల్ చెల్లింపులు పెరగడమే కాకుండా పొదుపు గ్రూపు సభ్యులు మోసపోవడానికి ఏమాత్రమూ ఆస్కారం ఉండదు.
డ్వాక్రా లావాదేవీలకు ఆటో డెబిట్ విధానం
బుక్కరాయసముద్రం మండలంలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
జిల్లా అంతటా డ్వాక్రా సంఘాల్లో అమలుకు కార్యాచరణ


