ఉద్యాన పంటల్లో ఈ–క్రాప్ నమోదును పరిశీలిస్తున్న డీహెచ్‌వో జి.చంద్రశేఖర్
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 12 మండలాల పరిధిలో 6.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 45.2 మి.మీ, శింగనమల 36.4, పామిడి 27.4, పుట్లూరు 25.4, యల్లనూరు 23.4 మి.మీతో పాటు తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, గార్లదిన్నె, అనంతపురం, బుక్కరాయసముద్రం, బెళుగుప్ప తదితర మండలాల్లో వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా, ఇప్పటి వరకు 73.3 మి.మీ నమోదైంది. మొత్తం మీద ఈ సీజన్‌లో 284.7 మి.మీకు గాను 206.1 మి.మీ వర్షం కురిసింది. ఈ నెలాఖరుతో ఖరీఫ్ ముగుస్తుంది. అక్టోబర్ నుంచి రబీ మొదలు కానుంది. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు కొంత ఊరటనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఉద్యాన పంటలకు
ఈ–క్రాప్ తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: అన్ని రకాల ఉద్యాన పంటలను ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలని ఆ శాఖ రెండు జిల్లాల అధికారులు బి.రఘునాథరెడ్డి, జి.చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాలామంది రైతులు వ్యవసాయ పంటలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉద్యాన పంటలకు కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించాలని సూచించారు. చీనీ, దానిమ్మ, అరటి, టమాట వంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నందున ఈ–క్రాప్ అనేది చాలా కీలకమన్నారు. పంట ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా ఈ–క్రాప్ ముఖ్యమని తెలిపారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నందున ఆర్‌బీకే అసిస్టెంట్లను సంప్రదించి పండ్లతోటలు సాగు చేసిన ప్రతి రైతూ పంట వివరాల నమోదుతో పాటు ఈ–కేవైసీ కూడా చేయించుకోవాలని సూచించారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించం
● ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరిక
కళ్యాణదుర్గం/ అనంతపురం క్రైం: జిల్లాలో ఎక్కడైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. రాయదుర్గం మండలం వడ్రవన్నూరుకు చెందిన రామప్ప తన పిల్లల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం కళ్యాణదుర్గం వచ్చి, అక్కడి నుండి అనంతపురం ఆస్పత్రికి బయలుదేరారు. కళ్యాణదుర్గం శివారులోని అక్కమ్మ గారి కొండ వద్ద ఇద్దరు హిజ్రాలు రామప్ప బైక్‌ను ఆపి రూ.2,500 బలవంతంగా లాక్కున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎస్పీ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఇద్దరు హిజ్రాలను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఎక్కడా ఈ తరహా ఘటనలు జరిగేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. బలవంతపు వసూళ్లు ఏ రూపంలోనైనా, ఏ కోణంలో ఉన్నా సహించబోమన్నారు. యాచన పేరుతో బలవంతంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, హిజ్రాలు సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన సూచించారు. ఎక్కడైనా బలవంతపు వసూళ్లకు దిగినా, ప్రజలకు అసౌకర్యం కలిగినా, ఈవ్‌టీజింగ్, తదితర వేధింపులు జరిగినా వెంటనే తన సెల్ (94407 96800)కు ఫోన్ చేయవచ్చని, లేదా సమాచారం పంపవచ్చని ఎస్పీ తెలిపారు.
యల్లనూరు వద్ద చిత్రావతి నది పరవళ్లు
బలవంతపు వసూళ్లకు పాల్పడిన హిజ్రాలు వీరే


