‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’

- - Sakshi

అనంతపురం క్రైం: ‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’ అంటూ బాధితురాలు దిశ మహిళా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను దిశ పోలీసుస్టేషన్‌ సీఐ చిన్నగోవిందు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఎరుకల చందన, ఎన్‌పీకుంట మండలం పట్టంవారిపల్లికి చెందిన వడ్డే నవీన్‌ ప్రేమించుకున్నారు. ఇరువురూ పెద్దలను ఎదిరించి ఈ ఏడాది మే 29న కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అనంతపురం నగరంలోని మున్నానగర్‌లో వారు కాపురం పెట్టారు.

కొంతకాలం వారి సంసారం సజావుగా సాగింది. అయితే భర్త తరఫువారు వారి సంసారంలో జోక్యం చేసుకోవడంతో చందనకు కష్టాలు మొదలయ్యాయి. వరకట్నం తీసుకురావాలని చందనపై ఒత్తిడి తీసుకువచ్చారు. కులం తక్కువదానివంటూ హేళన చేస్తూ వచ్చారు. రూ.3 లక్షలు తీసుకువస్తే కాపురానికి రావాలని, లేకపోతే ఇంట్లోకి ఉండనివ్వమంటూ దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దలు కూడా పంచాయితీలు చేసి ఇరువురికి సర్దిచెప్పారు.

అత్తింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలని చెప్పడంతో చందన పుట్టింటికి వెళ్లింది. అయితే నవీన్‌ అక్కడికి వెళ్లి చందన పెళ్లి సమయంలో తీయించుకున్న ఫొటోలను చింపేసి సెల్‌ఫోన్‌ని పగుల గొట్టాడు. నవీన్‌తో పాటు అతని తండ్రి రమణప్ప, బావ నిరంజన్‌ దాడిలో పాల్గొనడంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top