
2006లో ఫ్లోరిడాలో నిర్మించిన ఇన్‌ఫెర్ కంపెనీ భవనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: బీటెక్ చదవడం, అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేయడం ఆ తర్వాత అక్కడే ఉద్యోగంలో స్థిరపడడం.. ఇదీ మన యువత చేస్తున్న సాదాసీదా కొలువులు. అయితే అందరిలా ఆ యువకుడు ఆలోచించలేదు. మనం ఎవరి దగ్గరో పనిచేయడమేంటి మనమే కంపెనీ పెడితే మరో పది మందికి ఉద్యోగాలివ్వచ్చు కదా అన్నది అతని ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవుగా అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి రమారమి ఏడాదికి వెయ్యికోట్ల టర్నోవర్‌కు ఎదిగాడు. కంపెనీలో 200 మందికి ఉద్యోగాలు కల్పించారు. అక్కడ ఏటా రూ.6 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగులూ ఉన్నారు. ఇంతటి ఘనత సాధించిన ఆ యువకుడే శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లికి చెందిన తిరుమలేంద్రరెడ్డి. ఇటీవల అనంతపురం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. తిరుమలేంద్రరెడ్డి ఏమన్నారో... ఆయన మాటల్లోనే
ఐటీ కంపెనీ పెట్టాలని చిరకాల వాంఛ
నా ప్రాథమిక విద్య అనంతపురం జిల్లాలోనే కొనసాగింది. బీటెక్ బెంగళూరులో చదివాక అమెరికాకు వెళ్లా. ఐటీ కంపెనీ పెట్టి పదిమందికి ఉద్యోగాలివ్వాలనేది నా చిరకాల వాంఛ. సరిగ్గా 22 ఏళ్ల క్రితం న్యూజెర్సీలో ఇన్‌ఫెర్ అనే ఐటీ సొల్యూషన్ కంపెనీ పెట్టా. ఇప్పుడు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మా కంపెనీ ద్వారా అమెరికా ప్రభుత్వ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, డిఫెన్స్, హెల్త్ సెక్టార్‌లకు సంబంధించిన వాటికి ఐటీ సేవలు అందిస్తున్నాం.
తొలిసారిగా ఇంక్–5000 జాబితాలో
ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడం ఎలాంటి ఘనతనో అమెరికాలో ఇంక్–5000 జాబితా కూడా అలాంటిదే. నేను స్థాపించిన ఇన్‌ఫెర్ సొల్యూషన్స్ కంపెనీకి 2022–23 సంవత్సరానికి గాను ఇంక్–5000లో స్థానం లభించింది. దీంతో అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నిటికీ కంపెనీ గురించి తెలిసింది. ఒక తెలుగు వ్యక్తి స్థాపించిన కంపెనీ తొలిసారి ఇలా లిస్ట్ కావడమనేది చాలా గొప్ప విషయం. నా 22 ఏళ్ల కల ఫలించింది. నా కంపెనీలో ఇప్పుడు ఏడాదికి రూ.6 కోట్లు (ఇండియా కరెన్సీ) తీసుకునే ఉద్యోగులూ ఉన్నారు.
కచ్చితమైన స్కిల్‌తో అమెరికా రావాలి
బీటెక్ చేశాం... ఎంటెక్ పూర్తయింది.. ఎంఎస్ చదివాం..అమెరికా వెళ్దాం అనే ఆలోచనతో ఎవరూ ఇక్కడికి రావద్దు. సబ్జెక్టులో ప్రత్యేక స్కిల్ ఉంటే అమెరికాలో ఉద్యోగానికి ఢోకా ఉండదు. మన స్కిల్‌ను బట్టి ఎంత పెద్ద కంపెనీకై నా వెళ్లొచ్చు.
ఏడాదికి ఐదుగురు అనాథల దత్తత
నేను కరువుజిల్లా నుంచి వచ్చాను. అందుకే ప్రతి ఏటా ఐదుగురు అనాథలను దత్తత తీసుకుని చదివించాలన్నది కోరిక. ఇప్పటికే కొంతమందిని చదివిస్తున్నా. ఇకపై ఏటా ఐదుగురిని తీసుకుని వారిని మంచి స్కూళ్లలో చేర్పించి ఉన్నత చదువుల వరకూ చదివిస్తా. వారి జీవితాల్లో వెలుగు చూస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు.
జగనన్న కృషికి హ్యాట్సాఫ్
ఏపీలో విద్యారంగం మీద పెడుతున్న పెట్టుబడి అసాధారణం. భవిష్యత్ తరాలకు అదొక పెద్ద వరం. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాలన్నీ ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు గొప్ప వరం. జగనన్న స్ఫూర్తితోనే నేను కూడా నావంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నా. ఇలా చదువుకు ప్రోత్సాహమిచ్చే పథకాలు ఏపీలో మినహా భారతదేశంలో మరెక్కడా లేవు. అందుకే నేను జగనన్న అభిమానినయ్యా.
కరువు సీమ నుంచి వెళ్లి అమెరికా రక్షణ విభాగానికి విలువైన సేవలు
తిరుమలేంద్రరెడ్డి స్థాపించిన కంపెనీకి ఇంక్–5000 జాబితాలో చోటు
ఏటా రూ.వెయ్యి కోట్ల టర్నోవర్

ప్రస్తుతం న్యూజెర్సీలోని ఇన్‌ఫెర్ కార్యాలయం

తిరుమలేంద్రరెడ్డి పుట్టి పెరిగిన నారాయణరెడ్డి పల్లెలోని ఇల్లు

తిరుమలేంద్రరెడ్డి, ఇన్‌ఫెర్ కంపెనీ ఎండీ