
లలీంద్ర (ఫైల్)
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: అనంతపురంలో శనివారం కర్ణాటక వాసి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇక్కడ ప్రత్యేక క్యాంప్‌లో తలదాచుకున్న ఓ వార్డుమెంబర్‌ను రెండు కార్లలో వచ్చిన ప్రత్యర్థి వర్గీయులు దాడి చేసి అపహరించుకుపోయారు. దాడి ఘటనలో బాధితుడి వర్గీయులు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన వివరాలను త్రీటౌన్ సీఐ ధరణీకిషోర్, నాల్గవ పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని రాయచూరు మేజర్ పంచాయతీలో పూరుతిప్పలి, తురకందోణ, అలుకూరు గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలో 16 వార్డు మెంబరు స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పోటాపోటీగా అంటే చెరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందాయి. గెలిచిన అభ్యర్థులు ఆగస్టు రెండో తేదీన సర్పంచ్, ఉప సర్పంచులను ఎన్నుకోవాల్సి ఉంది. సర్పంచ్ స్థానం కోసం జేడీఎస్ తీవ్ర ప్రయత్నాలు చేపట్టింది. వారికి ఆ చాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ తన వార్డుమెంబర్లను సురక్షితంగా కాపాడుకునేందుకు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని శ్రీతేజా లాడ్జ్‌లో కాంగ్రెస్ వార్డు సభ్యులు నాగరాజు, తిప్పేనాయక్, లలీంద్ర, ఎల్లప్ప, బసిరెడ్డి, యేసు, రెడ్డెప్ప, వానేస్ బస చేశారు.
పట్టపగలే దర్జాగా కిడ్నాప్
లాడ్జ్‌కు సమీపంలోని రిటైర్డు డీఎస్పీ బాలనరసింహారెడ్డి ఇంటి ముందు హోటల్‌లో కాంగ్రెస్ వార్డు సభ్యులు టిఫిన్ చేసేందుకు వచ్చారు. అప్పటికే వీరి కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యర్థి వర్గం రెండు కార్ల (ఇన్నోవా, ఆడీ)తో సిద్ధంగా ఉంది. వార్డుమెంబర్లలో ఒకరైన లలీంద్రను బలవంతంగా కారులోకి ఎక్కించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మిగిలిన వారిలో మరో ఇద్దరిని అపహరించేందుకు ప్రయత్నించగా.. వారు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలూ కూల్‌డ్రింక్ బాటిళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. లలీంద్ర వర్గీయుల్లో తిప్పేనాయక్, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం క్షణాల వ్యవధిలో ప్రత్యర్థి వర్గం వారు లలీంద్రను కిడ్నాప్ చేసుకుని కార్లలో కర్నూలు వైపు ఉడాయించారు. బాధితుడు తిప్పేనాయక్ ఫిర్యాదుతో కిడ్నాప్‌ను ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
అనంతపురంలో కర్ణాటక వాసి అపహరణ
సర్పంచు ఎన్నికల నేపథ్యంలో ఘటన

గాయపడిన తిప్పేనాయక్