
వికాస్ మృతదేహం
పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా అనుబంధ పరిశ్రమ నేషనల్ ఆటో ప్లాస్ట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన వికాస్ (27) బుధవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇతను కొంతకాలంగా పెనుకొండలోని ఆల్విన్ కాలనీలో సోదరుడు రాజు, మరి కొందరు కార్మికులతో కలసి అద్దె ఇంట్లో ఉంటూ నేషనల్ ఆటో ప్లాస్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన గదిలో గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తోటి కార్మికులు గమనించి.. చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. ఈ మేరకు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది, తోటి కార్మికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పారు.