టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిది

గుత్తి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిది.. దాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఆయన ఎంపీపీ విశాలాక్షి, మార్కెట్ యార్డు చైర్మన్ సునీలా యాదవ్, మాజీ చైర్మన్ మల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్‌బీ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 2014లో 650 హామీలతో మ్యానిఫెస్టో ప్రకటించారని, అయితే అందులో కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతు , డ్వాక్రా రుణమాఫీ వంటి హమీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం అని తన కొడుకు పప్పు (లోకేష్)కు మాత్రమే ఉద్యోగం ఇచ్చాడన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం, సీఎంగా వైఎస్ జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు.