
కేతు విశ్వనాథరెడ్డి (ఫైల్)
అనంతపురం కల్చరల్: రాయలసీమ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తొలితరం కథకుడు కేతు విశ్వనాథరెడ్డి (84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక సోమవారం ఉదయం ఈ లోకాన్ని వీడిపోయారు. 1939లో వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం, రంగసాయిపురంలో జన్మించిన ఆయన తొలి కథ ‘అనాది రాళ్లు’. ఆ తర్వాత వెలువరించిన కథలు, నవలలు, వ్యాస సంపుటాలు ఆయనను రాయలసీమకంతటికి సాహితీ ప్రతినిధిగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో ఆయనతో అనంత ప్రసిద్ధ సాహితీవేత్తలందరికీ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2021లో వైఎస్సార్ స్మారక జీవిత సాఫల్య పురస్కారమందుకున్నారు. ఆయన మరణ వార్త అనంత సాహితీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సీమ తొలితరం కథారచయితగా సాహిత్యానికి పరిపూర్ణమైన జవసత్వాలందించిన గొప్ప కథాశిల్పిగా కేతు విశ్వనాథరెడ్డిని ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ అభివర్ణించారు. కడప గ్రామ నామాల గ్రంథ పరిశోధనతో డాక్టరేట్ పొందిన కేతు విశ్వనాథరెడ్డి ప్రభావం ఇక్కడి వారందరిపై ఉందని డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి అన్నారు. ఆధునిక వచనం, భాషా శాస్త్రపరంగా చేసిన కృషి ఆదర్శప్రాయంగా నిలిచిందని సాహితీస్రవంతి ప్రతినిధులు డాక్టర్ ప్రగతి, పిళ్లా కుమారస్వామి అన్నారు. పాత్రికేయుడిగా, అధ్యాపకుడిగా, అంబేడ్కర్ యూనివర్సిటీ డైరెక్టర్‌గా ఆయన అందించిన సేవలు ఎనలేనివని అనంత జిరసం అధ్యక్షుడు సాకే శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్‌ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, జిరసం అధ్యక్ష కార్యదర్శులు జన్నె ఆనంద్, కొత్తపల్లి సురేష్ పేర్కొన్నారు. విశాలాంధ్ర పుస్తక ప్రచురణ సంస్థతో కేత విశ్వనాథరెడ్డికి అనేక దశాబ్ధాల అనుబంధం ఉందని సంస్థ మాజీ మేనేజర్ చెట్ల ఈరన్న తెలిపారు.