
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన కోవిడ్‌పై మళ్లీ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రమాదకరమేమీ కాకపోయినా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారు భావించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ నియంత్రణలో దేశంలో రోల్‌మోడల్‌గా ఏపీ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కోవిడ్ నియంత్రణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసింది.
అక్కడక్కడా కేసుల నమోదు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గడిచిన 15 రోజుల్లో 382 శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలు చేశారు. రెండు జిల్లాల్లోనూ కలిపి 9 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచాలని యోచిస్తుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స అందించనున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా అందుకు తగ్గట్టు ఇంజెక్షన్లు, మాత్రలు, మాస్కులు వంటివి అందుబాటులో ఉంచారు. బోధనాస్పత్రి నుంచి పీహెచ్‌సీ వరకు కోవిడ్ చికిత్స మందులు సమకూర్చారు.
కోవిడ్‌పై అప్రమత్తం
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం
జిల్లాలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వీరబ్బాయి తెలిపారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని మంగళవారం ఆయన సూపరింటెండెంట్ రఘునందన్‌తో కలిసి పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మాక్‌డ్రిల్‌ను రెండోరోజూ కొనసాగించినట్లు చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వసతులను క్లస్టర్ వారీగా పరిశీలించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా కోవిడ్‌కు వినియోగిస్తున్నామన్నారు. ప్రధానంగా ఆక్సిజన్ ప్లాంట్లలో ఆక్సిజన్ నిల్వ, బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వివరాలు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, సీడీ ఆస్పత్రి, జిల్లాలో ఉన్న రెండు ఏరియా ఆస్పత్రులు, 8 సీహెచ్‌సీలు, 45 పీహెచ్‌సీలు, 52 ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుజాత, వేణుగోపాల్‌యాదవ్, నారాయణస్వామి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు ముమ్మరం
అందుబాటులోకి అవసరమైన మందులు
5700కు పైగా అందుబాటులో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు
మాస్కులు, పీపీఈ కిట్‌లు జిల్లాకు పంపిన సర్కారు
ఉమ్మడి జిల్లాలో 15 రోజుల్లో 382 టెస్టులు.. 9 పాజిటివ్ కేసులు
అవసరాన్ని బట్టి నిర్ధారణ పరీక్షలు పెంచాలని అధికారుల యోచన
విలేజ్ క్లినిక్ స్థాయి నుంచే..
జిల్లాలో 433 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయి నుంచే కోవిడ్ ఉపకరణాలు అందుబాటులో ఉంచాం. అవసరమైతే టెస్టులు పెంచాలని చెప్పాం. దీనిపై అప్రమత్తంగా ఉన్నాం.
–డా.యుగంధర్, నోడల్ అధికారి
