జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు | Sakshi
Sakshi News home page

జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు

Published Fri, Apr 7 2023 12:48 AM

జగనన్న విద్యా కిట్లతో స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు  - Sakshi

రాప్తాడురూరల్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్‌, ఫర్నీచర్‌ ఇలా ఒకసారి పరిశీలిస్తే కార్పొరేట్‌ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాయి.

తల్లిదండ్రులకు పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌, పిక్టోరియల్‌ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్‌ కిట్‌లో ఉంటాయి. ఇప్పటికే మూడేళ్లు కిట్లను ఇచ్చారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గో విడత కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,22,212 మంది ఉన్నారు. వీరికోసం రూ. 36.66 కోట్లు ఖర్చు చేసి కిట్లు అందజేస్తున్నారు.

కార్పొరేట్‌ విద్యార్థుల్లా.. ప్రభుత్వ విద్యార్థులు

కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులు ఎలాగైతే యూనిఫాం, షూ, బెల్ట్‌ ధరించి వెళతారో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదే తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పాఠశాలలకు వెళ్తున్నారు. డ్రెస్‌ కోడ్‌తో పాటు ప్రతి విద్యార్థీ షూ వేసుకుంటున్నారు.

ఈసారి యూ‘న్యూ’ఫాం

విద్యార్థుల యూనిఫాం ఈసారి రంగు మారింది. గతంలో బాలికలకు పింక్‌, బ్లూ కాంబినేషన్‌, బాలురకు లైట్‌ స్కై, థిక్‌ బ్లూ కాంబినేషన్‌లో యూనిఫాం ఇచ్చేవారు. గతంలో ప్లెయిన్‌లో ఉండే యూనిఫాం ఈసారి బాలికలకు మాత్రం చెక్స్‌ కల్గినవి ఇస్తున్నారు. బ్యాగులు గతంలో ముందువైపు స్కై బ్లూ, వెనుక వైపు నేవీబ్లూ కలరు ఉండేది. ఈసారి యూనిఫాం, బ్యాగులు రంగులు మారాయి.

కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో గతంలో వెనుకడుగు వేసేవారు. ఒకవేళ పంపినా ఆ తర్వాత నోట్‌ పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు అరకొర ఖర్చు కూడా భరించలేక చాలామంది డ్రాపౌట్స్‌గా మారేవారు. అయితే, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులకు పుస్తకాలే కాదు... జగనన్న విద్యాకానుక రూపంలో రూ. 1,650 విలువైన సామగ్రి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు కిట్లు అందజేసిన ప్రభుత్వం.. నాలుగో సారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దేశంలో ఎక్కడా లేదు

ప్రభుత్వ పాఠశాలల పిల్లల యూనిఫాం, షూ క్వాలిటీని ఒక ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. కార్పొరేట్‌ తరహా డ్రెస్‌కోడ్‌తో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారనే ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది. జగనన్న విద్యా కిట్లు చాలా నాణ్యతగా ఉంటున్నాయి. ప్రభుత్వం పిల్లల చదువు విషయంలో రాజీలేకుండా ఖర్చు చేస్తోంది.

- ఎం.సాయిరామ్‌, ఏపీఓ, సమగ్ర శిక్ష

1/2

2/2

Advertisement
Advertisement