ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు
● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు వివరించారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీలకూ ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అధికారులతో సమీక్షిస్తున్న సీఎండీ శివశంకర్


