కళాశాల కీర్తిప్రతిష్టలు పెంపొందించండి

- - Sakshi

అనంతపురం: ఎంతో ఘన చరిత్ర కలిగిన జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల కీర్తిప్రతిష్టలు పెంపొందించేలా విద్యార్థులు ఉన్నతస్థానాలు అధిరోహించాలని జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్‌ కళాశాల 76వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి వీసీ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యాప్రణాళికలో సమూల మార్పులు చేశామన్నారు. 40 శాతం నచ్చిన సబ్జెక్టులు చదువుకోవచ్చన్నారు. బ్రాంచ్‌ సబ్జెక్టులే కాకుండా ఇతర బ్రాంచ్‌ సబ్జెక్టులు సైతం చదవడానికి వెసులుబాటు ఉందన్నారు. బీటెక్‌ ఆనర్స్‌ విధానంతో పాటు మేజర్‌ డిగ్రీతో పాటు మైనర్‌ డిగ్రీని చదవడానికి అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు దన్నుగా నిలిచేలా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోందన్నారు. ఈ పథకాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. విశిష్ట అతిథి జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ మాట్లాడుతూ యువత దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రణాళికాబద్ధంగా జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ప్రతి విద్యార్థీ ఎదగలన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత, స్పోర్ట్స్‌ సెక్రెటరీ జోజిరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.భవాని, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన

జేఎన్‌టీయూ వీసీ జింకా రంగజనార్దన పిలుపు

ఘనంగా ఇంజినీరింగ్‌ కళాశాల 76వ వార్షికోత్సవం

జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా ప్రణాళిక

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top